Azadi Ka Amrit Mahotsav: పౌరుషం.. పరాక్రమం.. మధ్యలో గుంటనక్క

అవి పక్కపక్కనే ఉన్న రెండు బలమైన రాజ్యాలు. వినోద క్రీడల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే స్పర్థ క్రమంగా శత్రుత్వానికి దారితీసింది. సరిహద్దు వాగుల్లోని నీటి వాడకంలో పట్టింపులు నిప్పు

Updated : 29 Apr 2022 05:54 IST

అవి పక్కపక్కనే ఉన్న రెండు బలమైన రాజ్యాలు. వినోద క్రీడల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే స్పర్థ క్రమంగా శత్రుత్వానికి దారితీసింది. సరిహద్దు వాగుల్లోని నీటి వాడకంలో పట్టింపులు నిప్పు రాజేశాయి. పౌరుషం పేరిట ఒకరు... పరాక్రమం పేరిట మరొకరు  యుద్ధాల్లో మునిగి తేలారు. వీరి బలహీనతను పావుగా మార్చుకున్న ఓ గుంటనక్క    మధ్యలో దూరింది. ఒకరిని తుదముట్టించింది. మరొకరికి తీరని నష్టం కలిగించింది. ఆ రాజ్యాలే బొబ్బిలి, విజయనగరం సంస్థానాలు. వీటి మధ్య తలదూర్చి, కనీవినీ ఎరుగని రక్తపాతానికి కారణమైన గుంటనక్క ఫ్రెంచి సైనికాధికారి బుస్సీ.

బొబ్బిలి జమీందారులు, విజయనగరం గజపతులు మొదట్లో స్నేహంగా ఉండేవారు. కోడి పందేలు, కుస్తీ పోటీలను ఉమ్మడిగా నిర్వహించేవారు. వీటిలో గెలుపోటములు వారి మధ్య దూరం పెంచాయి. వాగుల్లోని నీటి వాడకంలో వచ్చిన మనస్పర్థలతో శత్రుత్వం మొదలైంది. విజయనగరం రాజు పెద విజయరామ గజపతి, బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావుల సమయంలో ఇది తారస్థాయికి చేరింది. బొబ్బిలిని తమ రాజ్యంలో కలిపేసుకోవాలని గజపతి పట్టుదల ప్రదర్శించారు. ఈ క్రమంలో బొబ్బిలిపై రెండుసార్లు దండెత్తినా పరాజయం పాలయ్యారు. మూడోసారి తమ బంధువు రామచంద్రరాజు నాయకత్వంలో సైన్యాన్ని పంపగా... బొబ్బిలి వీరులు ఆయన తల నరికి పెద విజయరామకు పంపించారు.

బుస్సీ రాకతో మారిన బలాబలాలు
ఫ్రెంచి సైనికాధికారి మార్క్‌ డీ బుస్సీ నిజాం నవాబు అంగీకారంతో హైదరాబాద్‌లో సైనిక స్థావరం ఏర్పాటు చేసుకుని దక్కనులో విశేష అధికారాన్ని చెలాయించాడు. నిజాం పరివారంలో తలెత్తిన తిరుగుబాటులో ముజఫర్‌ జంగ్‌ను సమర్థించి, 1750లో హైదరాబాద్‌ పీఠంపై కూర్చోబెట్టాడు. దాంతో ఉత్తర సర్కారు జిల్లాలు ఫ్రెంచి వారికి దక్కాయి. నాటి నుంచి ఈ ప్రాంత రాజులు, జమీందారులంతా ఫ్రెంచి వారికి కప్పం చెల్లించారు. అయితే... 1756 వచ్చేసరికి బుస్సీ ప్రాభవం తగ్గడంతో పెద విజయరామ గజపతి మినహా జమీందారులంతా కప్పం చెల్లించడం మానేశారు. రాజకీయం నెరిపి, వారిని దారికి తెచ్చుకోవడానికి బుస్సీ రాజమహేంద్రవరానికి చేరుకున్నాడు. బొబ్బిలి రాజు తప్ప గజపతితోపాటు మిగిలిన జమీందారులంతా ఘనంగా స్వాగతించారు. బుస్సీకి గజపతి కప్పం చెల్లించి, ఆయన దివాన్‌ హైదర్‌జంగ్‌కు నజరానాలు సమర్పించారు. పనిలోపనిగా బొబ్బిలిపైనా ఫిర్యాదు చేశారు. కొన్నిరోజులకు బొబ్బిలి రాజ్యం మీదుగా వెళుతున్న ఫ్రెంచి సైనికులపై దాడి జరగగా 30 మంది చనిపోయారు. దీనికి బొబ్బిలి రంగారావును బాధ్యుడిగా చేసిన బుస్సీ... తక్షణమే కోటను ఖాళీ చేసి, మరెక్కడైనా సంస్థానం ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే యుద్ధం తప్పదని హెచ్చరించాడు. బుస్సీని స్వయంగా కలవడానికి, యుద్ధ నివారణకు రంగారావు చేసిన ప్రయత్నాలను హైదర్‌జంగ్‌ అడ్డుకున్నాడు.

తాండ్ర పాపారాయుడిని ఏమార్చి...
రంగారావు బావమరిది, బొబ్బిలి సర్వసైన్యాధ్యక్షుడు తాండ్ర పాపారాయుడు యుద్ధరంగంలో ఉంటే గెలుపు అసాధ్యమని నమ్మిన బుస్సీ ఆయన రాజాం వెళ్లేలా పన్నాగం పన్నాడు. వెంటనే విజయనగరం, ఫ్రెంచి సైన్యాలు ఉమ్మడిగా కదిలి బొబ్బిలి కోటను 1757 జులై 24 తెల్లవారుజామున ముట్టడించాయి. ఫిరంగులతో కోటను ఛేదించినా, బొబ్బిలి సైనికుల వీరోచిత పోరాటంతో లోనికి ప్రవేశించడం సాధ్యం కాలేదు. ఓటమిని ఊహించిన రంగారావు, ఆయన మంత్రివర్గం సమావేశమై... తమతోపాటు ఆడవాళ్లు, పిల్లలు శత్రువు చేతికి చిక్కి అవమానాల పాలవకూడదనే ఉద్దేశంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు రాజు, రాణి మల్లమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత బొబ్బిలి సైనికులే కోట లోపలి ఇళ్లకు నిప్పంటించారు. భయంతో బయటికి పరుగెత్తుకొచ్చిన ప్రజలను కత్తులతో పొడిచి చంపారు. తామంతా మృతి చెందాకే... చిన్నవాడైన తన కొడుకును చంపాలని రాజగురువును రంగారావు అంతకుముందే కోరారు. సాయంత్రానికి బొబ్బిలి ఆఖరి సైనికుడు అంతమయ్యాకే కోట ఫ్రెంచి సైన్యం వశమైంది. లోపల ఎటుచూసినా శవాలే కనిపించడంతో వారు భీతావహులయ్యారు. రాజు కొడుకును చంపడానికి మనసు రాని రాజగురువు... పిల్లాడిని బుస్సీకి అప్పగించగా... అతణ్ని బొబ్బిలి వారసుడిగా ప్రకటించాడు.

యుద్ధం ముగిసిన మూడోరోజు బొబ్బిలికి వచ్చిన తాండ్ర పాపారాయుడు... గజపతులపై పగ తీర్చుకుంటానని శపథం చేశారు. ఫ్రెంచి సైన్యం విడిదిచేసిన, డేరాలో నిద్రిస్తున్న పెదవిజయరామ గజపతిని కత్తితో పొడిచి చంపారు. తర్వాత సైనికుల తుపాకీ గుళ్లకు పాపారాయుడూ నేలకొరిగారు. ఇలా గొప్ప వీరుల ప్రస్థానం చరిత్రలో సువర్ణ అధ్యాయమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని