Azadi Ka Amrit Mahotsav: మహిళల ప్రాణాలే వారికి ఇంధనం

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇంధనం కొరత పేరిట మన మహిళల ప్రాణాలతో చెలగాటమాడారు. ప్రపంచమంతా వ్యతిరేకించినా వారిని బొగ్గు గనుల్లో మగ్గేలా

Updated : 04 May 2022 06:04 IST

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇంధనం కొరత పేరిట మన మహిళల ప్రాణాలతో చెలగాటమాడారు. ప్రపంచమంతా వ్యతిరేకించినా వారిని బొగ్గు గనుల్లో మగ్గేలా చేశారు. యుద్ధం ముగిశాక చేతులు దులిపేసుకున్నారు. బాధిత మహిళల్లో అత్యధికులు  ఆకలితో పోరాడలేక అసువులుబాస్తున్నా పట్టించుకోలేదు.

బ్రిటిషర్ల యుద్ధాల కోసం భారతీయులు ఎన్నో త్యాగాలు చేశారు. పురుషులు ప్రత్యక్షంగా, మహిళలు పరోక్షంగా పోరాడారు. ఇదే కోవలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన 1939లో తొలుత 2లక్షల మంది భారతీయ సైనికులను పంపించారు. తర్వాత వారి సంఖ్యను 25 లక్షలకు పెంచారు. మగవారు యుద్ధాలకు వెళ్లడంతో గనులు, పరిశ్రమలలో కార్మికుల కొరత ఏర్పడింది. పైగా జపాన్‌ దాడి చేస్తుందనే భయంతో ఈశాన్య భారత సరిహద్దుల రక్షణకు ఎక్కువ మంది సైనికులను పంపించారు. ముఖ్యంగా గని కార్మికుల్లో చాలామంది యుద్ధాలకు వెళ్లడంతో తవ్వేవారు లేక బొగ్గు కొరత మొదలైంది. పరిశ్రమలకు, విద్యుదుత్పత్తికి కేటాయింపులు తగ్గించినా సమస్య తీరలేదు. అప్పట్లో దేశ బొగ్గు అవసరాలను బెంగాల్‌, బిహార్‌లలోని గనులే 98% తీర్చేవి.

సహాయక దళాల ఏర్పాటు
మొదటి ప్రపంచ యుద్ధంలో వైద్య విభాగంలో మాత్రమే పనిచేసిన మహిళలను రెండో ప్రపంచ యుద్ధం నాటికి ఇతర అవసరాలకూ తీసుకున్నారు. ఇందుకోసం 1942లో మహిళలతో సహాయక దళాలను ఏర్పాటు చేయగా భారత్‌లో 11,500 మంది చేరారు. వీరిని డ్రైవింగ్‌, ఆయుధాల నిర్వహణ, యుద్ధభూమికి సరకుల సరఫరా, టైపింగ్‌, ఉత్తరాల బట్వాడా వంటి పనుల్లో వినియోగించారు. బిహార్‌, బెంగాల్‌లలో మాత్రం దళితులు, ఆదివాసీ మహిళలను బొగ్గు గనుల్లో కార్మికులుగా నియమించారు.

ఆకలితో పోరాడలేక... నేల తల్లిని తవ్వలేక...
బెంగాల్‌లో సంభవించిన తీవ్ర కరవుతో 1943లో 35 లక్షల మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో పురుషులే అధికం. మిగిలిన వారికి ఉపాధి లేకపోవడంతో మహిళలు, చిన్నారులు అల్లాడారు. డొక్కలు ఎండిపోయి రాబందుల పాలయ్యారు. రక్షించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. తిండి గింజల కోసం ఏకంగా 60 వేల రైతు కుటుంబాలు తమ వ్యవసాయ పరికరాలను తెగనమ్ముకున్నాయి. ఇలాంటి  క్లిష్ట పరిస్థితుల్లో తమ పిల్లలను రక్షించుకోవడానికి మహిళలు గనుల్లో పనికి కుదిరారు. ఇలా వెళ్లిన వారి సంఖ్య 1945 వచ్చేసరికి 74 వేలకు చేరింది. వీరిలో దాదాపు 22 వేల మంది బొగ్గు తవ్వగా, 52 వేల మంది దాన్ని పైకి చేరవేసేవారు. వీరు నెలకు ఏకంగా 3.85 లక్షల టన్నుల బొగ్గును తవ్వారు. యుద్ధం ముగిశాక వీరి ఘనతపై ‘మహిళలు మనల్ని రక్షించారు’ అని బ్రిటిష్‌ పార్లమెంటుకు నివేదిక ఇచ్చిన అధికారులు కార్మికుల సంక్షేమానికి మాత్రం ఏమీ చేయలేదు.

అవి మృత్యు కుహరాలే
బొగ్గు గనులన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటంతో వేతనాలు అతి తక్కువగా ఉండేవి. మగవారికి వారానికి అయిదు నుంచి ఏడు రూపాయలు, స్త్రీలకు అందులో సగమే ఇచ్చేవారు. ఆక్సిజన్‌ సరిగా అందక స్త్రీలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారు. గనుల్లో భద్రతా చర్యలు లేకపోవడంతో 1943 నుంచి 1945 మధ్య ఏకంగా 900 వరకు ప్రమాద ఘటనలు జరిగి, చాలాసార్లు పదుల సంఖ్యలో మహిళలు మృత్యువాత పడ్డారు. అధికారులు సహాయ చర్యలను ఏనాడు పర్యవేక్షించలేదు. పైగా మహిళలు పనుల్లో చేరడానికి ఉన్న అర్హత వయసును 18 ఏళ్ల నుంచి 17 ఏళ్లకు కుదించారు. 1919లో ఏర్పాటైన అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్‌వో) ఆదేశాల ప్రకారం గనుల్లో మహిళలు, చిన్నపిల్లలతో పని చేయించరాదు. ఈ మేరకు భారత్‌లో 1937లో నిషేధం విధించిన ఆంగ్లేయ ప్రభుత్వం యుద్ధం పేరిట 1943లో ఎత్తివేసింది. ఈ చర్యపై ఐఎల్‌వోతోపాటు ప్రపంచమంతా వ్యతిరేకించినా వెనక్కి తగ్గలేదు. మేం వద్దంటున్నా వారే స్వచ్ఛందంగా గుంపులు, గుంపులుగా వచ్చి చేరుతున్నారని బుకాయించింది. కరవు తీవ్రతను దాచేసింది. యుద్ధం పూర్తిగా ముగిశాక... 1946 ఫిబ్రవరి 1న గనుల్లో మహిళా కార్మికులపై నిషేధం విధించింది. దాంతో ఉన్నపళంగా వేల మంది మహిళలు వీధుల్లో పడ్డారు. కరవు ఛాయలు తొలగకపోవడంతో ఎక్కడా పనిదొరక్క వీరిలో చాలామంది ఆకలి, వ్యాధులతో మృత్యువాత పడ్డారు. బ్రిటన్‌ను యుద్ధంలో గెలిపించి... జీవనపోరాటంలో మాత్రం ఓడిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని