icon icon icon
icon icon icon

PM Modi: మోదీ వ్యాఖ్యలపై వివాదం.. మైనార్టీలపై నాడు మన్మోహన్‌ ఏమన్నారు?

PM Modi: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేస్తున్న వేళ.. భాజపా ఓ ఫ్యాక్ట్‌చెక్‌ వీడియోను విడుదల చేసింది. అందులో దేశ వనరులపై మైనార్టీలదే తొలి హక్కు అంటూ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నట్లుగా ఉంది.

Updated : 22 Apr 2024 10:53 IST

దిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దేశ వనరులపై మైనార్టీలదే తొలి హక్కు అని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) చేసిన వ్యాఖ్యలను ఆయన తాజాగా ప్రస్తావించారు. దీనిపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలను బలపర్చేలా భాజపా (BJP) ఓ వీడియోను విడుదల చేసింది.

యూపీఏ హయాంలో 2006 డిసెంబరు 9న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడిన వీడియో అది. ‘‘మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా వారికి సాధికారత కల్పిస్తూ మేం వినూత్న ప్రణాళికలను తీసుకురాబోతున్నాం. దేశంలోని వనరులపై వారికే తొలి హక్కు ఉండాలి’’ అని మన్మోహన్‌ చెబుతున్నట్లుగా దానిలో ఉంది. దీన్ని భాజపా తమ సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘కాంగ్రెస్‌కు తమ సొంత ప్రధానిపైనే నమ్మకం లేదు’’ అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.

కాంగ్రెస్‌ వస్తే.. సంపదంతా ముస్లింలకే

2006లో ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై ఏర్పాటు చేసిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో మన్మోహన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిపై అప్పట్లోనూ తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో నాడు ప్రధానమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని, తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వెల్లడించింది.

‘‘మా సమ్మిళిత ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. వ్యవసాయం, నీటిపారుదల, నీటి వనరులు, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులతో పాటు ఎస్సీ/ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, పిల్లల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం. ఎస్సీ/ఎస్టీల కోసం సమగ్ర ప్రణాళికలను పునరుద్ధరించాలి. అభివృద్ధి ఫలాలను సమానంగా అందుకునేలా మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలకు సాధికారిత కల్పించేందుకు వినూత్న ప్రణాళికలు తీసుకురావాలి. వనరులపై వారికే ప్రథమ హక్కు ఉండాలి’’ అని మన్మోహన్ తన ప్రసంగంలో తెలిపారని ఆ వివరణలో పేర్కొంది. ఇక్కడ ‘వనరులపై తొలి హక్కు’ అనే మాటను తాను పైన పేర్కొన్న ప్రాధాన్యత అంశాలతో పాటు ఎస్సీ/ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలు, మహిళలు, చిన్నారులందరినీ ఉద్దేశించి ఆయన అన్నారని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img