icon icon icon
icon icon icon

Y plus security: తల్లి కోసం ప్రచారం.. అజిత్‌ పవార్‌ తనయుడికి ‘వై ప్లస్‌’ భద్రత

బారామతి నుంచి పోటీ చేస్తోన్న తల్లి కోసం ఎన్నికల ప్రచారం చేస్తోన్న పార్థ్‌ పవార్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్‌ భద్రత కల్పించింది.

Published : 23 Apr 2024 18:18 IST

పుణె: లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ (Ajith pawar) తనయుడు పార్థ్‌ పవార్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ భద్రత కల్పించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్‌ సీటు నుంచి ఎన్సీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన ఆయన ప్రస్తుతం తన తల్లి సునేత్ర తరఫున చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు వై ప్లస్‌ సెక్యూరిటీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పుణె పోలీస్‌ కమిషనర్‌ అమితేశ్‌కుమార్‌ వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా పార్థ్‌కు రక్షణ కల్పించినట్లు ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు. బారామతి నుంచి బరిలో నిలిచిన తన తల్లి సునేత్ర పవార్‌ కోసం పార్థ్‌ ప్రజల్లో తిరుగుతున్నారని.. ఆయన దూకుడు ఉన్న నేత గనక మారుమూల ప్రాంతాలకు వెళ్లే సమయంలో భద్రతాపరమైన ఆందోళనలు ఉండటంతో ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించిందన్నారు. వై ప్లస్‌ భద్రత నాలుగో అత్యున్నత స్థాయి భద్రత. ఇందులో ఒకరిద్దరు కమాండోలతో కలిపి మొత్తంగా 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు. 

స్లో‘గన్‌’ అందుకుంటే పేలాల్సిందే.. జనాల్లో నాటుకుపోయిన నినాదాలివే!

సామాన్యులకే భద్రత లేదంటూ విమర్శలు

ఈ పరిణామంపై అజిత్‌ బంధువు, ఎన్సీపీ (ఎస్‌పీ) నేత రోహిత్‌ పవార్‌ స్పందించారు. రాజకీయ నాయకుల పిల్లలు, ఎమ్మెల్యేలు, సినీ నటులకు భద్రత కల్పించేందుకే డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రాధాన్యమిస్తున్నారు తప్ప సామాన్యుల భద్రతను విస్మరిస్తున్నారని విమర్శించారు. సంఘ విద్రోహశక్తుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న సామాన్యుల్ని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పార్థ్‌ భద్రత కోసం రెండు ట్యాంకులను కూడా ఏర్పాటు చేయండి అంటూ రోహిత్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img