icon icon icon
icon icon icon

LS Polls: 12 ఏళ్లలో ఎంపీగా తొలి ఏకగ్రీవం.. ఏడున్నర దశాబ్దాల్లో 35 మంది!

గుజరాత్‌లోని సూరత్‌ నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఎంపీ ఎన్నిక ఏకగ్రీవమైంది. గత 12 ఏళ్లలో ఇలా గెలుపొందిన తొలి ఎంపీ అభ్యర్థి ఆయనే.

Published : 22 Apr 2024 21:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) గుజరాత్‌లోని సూరత్‌ స్థానం నుంచి భాజపా (BJP) అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ (Mukesh Dalal) ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. గత 12 ఏళ్లలో ఈ విధంగా సీటు కైవసం చేసుకున్న తొలి ఎంపీ అభ్యర్థి ఆయనే కావడం గమనార్హం. భాజపా (BJP) తరఫున కూడా పోటీ లేకుండా ఎన్నికైన మొదటి వ్యక్తి ఆయనేనని సమాచారం. దీంతో ఈ సార్వత్రిక పోరులో కాషాయ పార్టీ తన గెలుపు ఖాతా తెరిచినట్లయ్యింది.

1951 నుంచి ఇప్పటివరకు పోటీ లేకుండానే ఎన్నికైన ఎంపీల సంఖ్య దాదాపు 35కు చేరుకుంది. వారిలో కాంగ్రెస్‌ నేతలే అధికం. చివరిసారి 2012లో ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌ యాదవ్ ఏకగ్రీవమయ్యారు. 2009లో కన్నౌజ్‌ నుంచి విజయం సాధించిన అఖిలేశ్‌.. ఆ తర్వాత యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో ఇలా తొమ్మిది మంది ఎంపీలు గెలిచారు.

ఎన్నికలకు ముందే భాజపాకు తొలి విజయం.. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం

అత్యధికంగా 1957లో ఏడుగురు అభ్యర్థులు పోటీ లేకుండానే లోక్‌సభలో అడుగుపెట్టారు. 1951, 1967లో ఐదుగురు, 1962లో ముగ్గురు, 1977లో ఇద్దరు, 1971, 1980, 1989ల్లో ఒక్కో అభ్యర్థి గెలుపొందారు. వైబీ చవాన్‌, ఫరూక్‌ అబ్దుల్లా, హరేకృష్ణ మహతాబ్‌, టీటీ కృష్ణమాచారి, పీఎం సయీద్‌, ఎస్‌సీ జమీర్‌ తదితర ప్రముఖ నేతలు ఈ జాబితాలో ఉన్నారు. సిక్కిం, శ్రీనగర్‌ స్థానాలు రెండుసార్లు ఏకగ్రీవమయ్యాయి.

సూరత్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన నీలేశ్‌ కుంభనీ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి ఆదివారం తిరస్కరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ నుంచి వేసిన మరో నామినేషన్‌ కూడా చెల్లనిదిగా ప్రకటించారు. ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో దలాల్‌ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈమేరకు ధ్రువపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img