icon icon icon
icon icon icon

Eshwarappa: భాజపాపై తిరుగుబావుటా.. ఈశ్వరప్పపై ఆరేళ్ల బహిష్కరణ వేటు!

భాజపా రెబల్‌ నేత కేఎస్‌ ఈశ్వరప్పపై ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు పడింది.

Published : 22 Apr 2024 21:43 IST

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) వేళ కర్ణాటకలో భాజపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప (KS Eshwarappa) వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. తన కుమారుడు కాంతేశ్‌కు హవేరీ నుంచి టికెట్‌ ఇవ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీపై తిరుగుబావుటా ఎగరేశారు. గతంలో ప్రకటించిన రాజకీయ రిటైర్మెంట్‌ను పక్కనపెట్టి మరీ శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో ఆయన వ్యవహార శైలిని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకుగానూ ఈశ్వరప్పను ఆరేళ్ల పాటు భాజపా (BJP)నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

అమిత్‌ షా చెప్పినా వినని ఈశ్వరప్ప.. రిటైర్మెంట్‌ పక్కన పెట్టి మరీ పోటీ

శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేఎస్‌ ఈశ్వరప్ప ఐదుసార్లు విజయం సాధించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్‌ దక్కేలా చేస్తానని మాట ఇచ్చి మోసగించారంటూ మాజీ సీఎం యడియూరప్పపై ఆయన గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం శివమొగ్గ నుంచి భాజపా తరఫున యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర పోటీలో ఉన్నారు. టికెట్ రాకపోవడానికి యడియూరప్పనే కారణమని ఆరోపిస్తూ.. తండ్రీకుమారుల నియంత్రణ నుంచి పార్టీకి విముక్తి కల్పించేందుకే తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగి బుజ్జగించినా.. ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలోనే అధిష్ఠానం ఆయనపై బహిష్కరణ వేటు వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img