icon icon icon
icon icon icon

Sandeshkhali: సందేశ్‌ఖాలీలో ఆయుధాలు వారే పెట్టి ఉంటారు: సీబీఐపై టీఎంసీ ఆరోపణలు

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో సోదాలు నిర్వహించడంపై అధికార టీఎంసీ పార్టీ స్పందించింది. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. 

Published : 27 Apr 2024 16:57 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali)లో సీబీఐ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిషనర్‌ (EC)ను ఆశ్రయించింది. ఎన్నికల సమయం కావడంతో తమతో సహా ప్రతిపక్షాల ప్రచారాన్ని అడ్డుకునేందుకు కేంద్రంలోని భాజపా.. సీబీఐని ప్రయోగిస్తోందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు లేఖను అందించింది.

‘‘శాంతిభద్రత అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న వేళ.. సందేశ్‌ఖాలీలోని ఓ ప్రదేశంలో ఎలాంటి సమాచారం లేకుండా సీబీఐ ఉద్దేశపూర్వకంగా సోదాలు నిర్వహించింది. నేషనల్‌ సెక్యూరిటీ గార్డుకు చెందిన బాంబ్‌ స్క్వాడ్‌తో సహా అదనపు బలగాలను దించింది. భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి బాంబు స్వ్కాడ్‌ అందుబాటులో ఉంది. ఇది సీబీఐ చేసే ఆపరేషన్‌కు సహాయం చేయగలదు. కానీ, దర్యాప్తు సంస్థ మాత్రం ఎలాంటి సహాయం కోరలేదు’’ అని ఫిర్యాదులో పేర్కొంది.

రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్‌ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం

‘‘ఒకవేళ ఆయుధాలను దర్యాప్తు సంస్థ రహస్యంగా అమర్చే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఆయుధాలు స్వాధీనం చేసుకొంది టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్‌ షేక్‌ బంధువు ఇంట్లో అని మీడియాకు తప్పుడు సమాచారం అందించారు. ఓటర్లలో భయాందోళనలు సృష్టించేందుకే ఇదంతా చేస్తోంది. ఎన్నికల సమయంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోకుండా తక్షణమే మార్గదర్శకాలను జారీ చేయాలి. ఈసీ స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని కోరింది.

టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్‌ షేక్‌.. సందేశ్‌ఖాలీలోని మహిళలపై అత్యాచారం చేశారన్న కేసులో మరింత విచారణ జరపాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. సీబీఐ దర్యాప్తును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు షాజహాన్‌ షేక్‌ బంధువు ఇంటినుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img