icon icon icon
icon icon icon

PM Modi: టెక్‌ హబ్‌ను ట్యాంకర్‌ హబ్‌గా మార్చారు - కాంగ్రెస్‌పై మోదీ ధ్వజం

మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోందని.. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు.

Published : 29 Apr 2024 18:14 IST

బాగల్‌కోట్‌: ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపిస్తూనే అలా జరగనివ్వనని ఉద్ఘాటించారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీలు భాజపా వైపు ఉన్నందున మైనార్టీలను బుజ్జగించాలని హస్తం పార్టీ చూస్తోందన్నారు. కర్ణాటకలోని బాగల్‌కోట్‌ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. స్థానిక అధికార ప్రభుత్వం స్వల్ప కాలంలోనే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు.

‘‘కర్ణాటకలో వెనకబడిన వర్గాల హక్కులను కాలరాసి రాజ్యాంగాన్ని మార్చే ప్రచారాన్ని కాంగ్రెస్‌ ప్రారంభించింది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు రాజ్యాంగం అంగీకరించదు. కానీ, కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఓబీసీ రిజర్వేషన్లలో కొంత భాగాన్ని ముస్లింలకు కేటాయించింది.  ఈతరహా రిజర్వేషన్ల కల్పనకు చట్టం తీసుకువస్తామని గతంలో పేర్కొన్న కాంగ్రెస్‌.. ఈసారి మ్యానిఫెస్టోలోనూ అటువంటి సంకేతాలే ఇస్తోంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏదేమైనా ఆ పార్టీ ప్రయత్నాలను ఫలించనివ్వనన్నారు. మీ హక్కులు, రిజర్వేషన్లు కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తానని.. దళితులు, ఆదివాసీ, ఓబీసీలకు ఇదే నా గ్యారంటీ అని హామీ ఇచ్చారు.

వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. స్వల్ప కాలంలోనే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం చట్టసభ సభ్యులకు సమయానికి నిధులు అందే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌.. ‘ప్రభుత్వాన్ని’ నడపటం లేదని, వసూల్‌ గ్యాంగ్‌ను నడుపుతోందని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. టెక్‌ హబ్‌గా ఉన్న బెంగళూరును ట్యాంకర్‌ హబ్‌గా మార్చిందని ఎద్దేవా చేశారు. తద్వారా ట్యాంకర్‌ మాఫియాకు సాయం చేస్తోందని, ఆ కమీషన్‌ పార్టీకి చేరుతోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img