icon icon icon
icon icon icon

PM Modi: ‘మత ప్రాతిపదికన కాంగ్రెస్‌ రిజర్వేషన్లు కల్పిస్తోంది’ - మోదీ ఆరోపణలు

కాంగ్రెస్‌ పార్టీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాళ్లు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను పేరుతో ప్రజలను దోచుకుంటారని ఆరోపించారు.

Published : 25 Apr 2024 16:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కూడా వ్యతిరేకించారని.. కానీ, కాంగ్రెస్‌ మాత్రం వక్రమార్గంలో వాటిని అమలుచేసి ఆయనకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనను దుర్భాషలాడుతూ రాహుల్‌ గాంధీ ఆనందిస్తున్నారని.. అయినప్పటికీ ఆయనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయకూడదన్నారు. మధ్యప్రదేశ్‌లోని మురైనా, యూపీలోని ఆగ్రాలో జరిగిన వేర్వేరు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడిన మోదీ.. కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. ఈసందర్భంగా రాహుల్‌, అఖిలేశ్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘కర్ణాటకలో కాంగ్రెస్‌ అనేకమంది ముస్లింలను అక్రమంగా ఓబీసీ జాబితాలో చేర్చింది. దేశ వనరులు తొలుత ముస్లింలకే చెందుతాయని కాంగ్రెస్‌ ప్రకటిస్తుంటే.. వాటిపై పేద ప్రజలకే మొదటి హక్కు ఉందని నేను చెబుతున్నా. మతపరంగా ఎటువంటి వివక్ష లేకుండా 80 కోట్ల మందికి భాజపా ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ అందించింది. ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటూ.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్‌ ఆటలు ఆడుతోంది. వాళ్లు అధికారంలోకి వస్తే ‘వారసత్వ పన్ను’ పేరుతో ప్రజల నుంచి సగానికి పైగా ఆస్తిని దోచుకుంటుంది’’ అని మధ్యప్రదేశ్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మోదీ, రాహుల్‌ వ్యాఖ్యలు.. కోడ్‌ ఉల్లంఘనపై ఈసీ నోటీసులు

‘‘మహిళల ఆస్తులపై కాంగ్రెస్‌ కన్ను పడింది. వాళ్లు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను పేరుతో ప్రజల సంపదను దోచుకుంటుంది. కానీ, నేను వాటికి కాపలాగా ఉన్నా. యూపీలో ఇద్దరు అబ్బాయిలు (రాహుల్‌-అఖిలేశ్‌) బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇచ్చి ఓబీసీ కోటాను తస్కరించాలని కాంగ్రెస్‌ చూస్తోంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ముస్లిం లీగ్‌ స్వభావాన్ని ప్రతిబింబిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ఎదగడం కొన్ని శక్తులకు ఇష్టం లేదు. భాజపాకు దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు. కానీ, కాంగ్రెస్‌కు మాత్రం వారి కుటుంబమే ప్రధానం’ అని ఆగ్రా సభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img