icon icon icon
icon icon icon

ప్రధాని మోదీపై చర్యలు తీసుకోండి.. ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది.

Published : 22 Apr 2024 21:15 IST

Congress | దిల్లీ: రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ (PM modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ (Congress) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ గెలిస్తే ఆస్తులను ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది. ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈమేరకు కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం సోమవారం ఎన్నికల సంఘాన్ని కలిసింది. మొత్తం 17 అంశాలపై ఫిర్యాదు చేసింది.

ప్రజల్లో విభజన తీసుకొచ్చేవిధంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మోదీ మాట్లాడారని కాంగ్రెస్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చేలా వ్యవహరించారని, తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని తెలిపింది. మతం ఆధారంగా మోదీ ఓట్లడిగారని.. విపక్ష పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా లేనిపోని నిందలు వేశారని ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఎన్నికలకు ముందే భాజపాకు తొలి విజయం.. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం..!

సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి తరఫున ప్రతిపాదించిన నేతల సంతకాలు తమవి కావని పేర్కొనడం, ఆపై ఆ నలుగురూ మిస్సయ్యారని కాంగ్రెస్‌ తెలిపింది. భాజపా అభ్యర్థికి వ్యతిరేకంగా ఉన్న విపక్ష నేతలందరూ నామినేషన్లను ఉపసంహరించుకోవడం అనేది పెద్ద విషయం కాబట్టి.. సూరత్‌ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా.. యూజీసీలో నియామకాలు చేపట్టడాన్నీ కాంగ్రెస్‌ తప్పుబట్టింది. ప్రధాని, ఆయన పార్టీ చేస్తున్న ధిక్కార, ఉద్దేశపూర్వక ఉల్లంఘనలపై ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఒకవేళ చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ఎన్నికల సంఘంపై ఉన్న గౌరవానికి మచ్చ వస్తుందని పేర్కొంది.

మోదీ ఏమన్నారు..?

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దేశంలోని వనరులపై మైనారిటీలదే తొలి హక్కు అని యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను తన వాదనకు మద్దతుగా మోదీ ఉదహరించారు. రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మాట్లాడారు. ‘‘ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చెప్పింది. ఆమేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img