icon icon icon
icon icon icon

LS Polls: లోక్‌సభ ఎన్నికలు.. 9లక్షల తాత్కాలిక ఉద్యోగాలు!

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో దాదాపు 9లక్షల మంది తాత్కాలికంగా ఉపాధి పొందుతారని అంచనా.

Published : 23 Apr 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో కొత్తగా అనేక మందికి ఉపాధి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీల ప్రచార సభల నేపథ్యంలో దాదాపు 9లక్షల మంది తాత్కాలికంగా ఉపాధి పొందుతారని ఓ అంచనా. ‘2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కచ్చితంగా ఎంత మందికి ఉపాధి లభిస్తుందనే విషయం.. ఎన్నికల స్థాయి, పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య, ఎన్నికల సంబంధిత కార్యకలాపాలపై ఇది ఆధారపడి ఉంటుంది. మొత్తంగా దాదాపు 9లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నాం’ అని వర్క్‌ఇండియా సీఈవో, సహవ్యవస్థాపకుడు నీలేశ్‌ దుంగర్వాల్‌ పేర్కొన్నారు. ఇవి భిన్న రకాల పనులకు సంబంధించినవి ఉంటాయన్నారు.

ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలింగ్‌ కేంద్రాల అధికారులు, ఎన్నికల సహాయకులు, సెక్యూరిటీ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రవాణా సమన్వయకర్తలు, అడ్మిన్‌ బృందం వంటివి ఎంతో కీలకమని నీలేశ్‌ పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో అకౌంటింగ్‌, డేటా ఎంట్రీ, సెక్యూరిటీ, బ్యాక్‌ ఆఫీస్‌, డెలివరీ, డ్రైవర్లు, సేల్స్‌ అండ్‌ రిటైల్‌, మాన్యువల్‌ జాబ్స్‌, కంటెంట్‌ రైటింగ్‌ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు.

ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధమవుతోన్న తరుణంలో గడిచిన ఆరు నెలల్లోనే దాదాపు 2లక్షల తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు వచ్చాయని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌, సీఈవో ఆదిత్య నారాయణ్‌ మిశ్రా పేర్కొన్నారు. సమాచార విశ్లేషణ, ప్రణాళిక, ప్రజా సంబంధాలు, మార్కెట్‌ సర్వే, మీడియా సంబంధాలు, కంటెంట్‌ డిజైన్‌, కంటెంట్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఏఐ స్ట్రాటజీలు, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు.

ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగడం నుంచి పోలింగ్‌ ముగిసే నాటికి ఈ అవకాశాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నామని ఆదిత్య నారాయణ్‌ వెల్లడించారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ప్రింటింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, ఫుడ్‌, కేటరింగ్‌, సెక్యూరిటీ, ఐటీ నెట్‌వర్క్‌ మేనేజిమెంట్‌ విభాగాల్లో ఇవి ఉండనున్నాయని చెప్పారు. దాదాపు 4లక్షల మందిని సర్వీసు ప్రొవైడర్లు తాత్కాలికంగా నియమించుకునే అవకాశం ఉందన్నారు. అయితే, ఇవి ఇప్పటికే ఉన్న జాబ్‌ మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం చూపవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img