icon icon icon
icon icon icon

ప్రజాస్వామ్యం నుదుట చెరగని తిలకం

ప్రజాస్వామ్యానికి పండగ వంటి ఎన్నికల నిర్వహణలో కాలంతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ దశాబ్దాలుగా చెక్కు చెదరని ఒక అంశం మాత్రం ఈ ప్రక్రియలో కీలక భూమిక వహిస్తూనే ఉంది.

Published : 21 Apr 2024 05:14 IST

ప్రస్తుత ఎన్నికలకు 26.55 లక్షల ఇండెలిబుల్‌ ఇంక్‌ వయల్స్‌ సరఫరా
1962 నుంచి ప్రత్యేకంగా ఎన్నికల సంఘానికే అందిస్తున్న ‘మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌’  
25కు పైగా దేశాలకూ ఎగుమతి

బెంగళూరు: ప్రజాస్వామ్యానికి పండగ వంటి ఎన్నికల నిర్వహణలో కాలంతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ దశాబ్దాలుగా చెక్కు చెదరని ఒక అంశం మాత్రం ఈ ప్రక్రియలో కీలక భూమిక వహిస్తూనే ఉంది. అదే... ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేతి చూపుడు వేలుపై వేసే సిరా ముద్ర! కొన్ని రోజుల పాటు చెరిగిపోకుండా ఉండే ఈ సిరా (ఇండెలిబుల్‌ ఇంక్‌)కు పెద్ద చరిత్రే ఉంది. 1962 నుంచి కర్ణాటక ప్రభుత్వానికి చెందిన ‘మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌’ దీనిని ఉత్పత్తి చేస్తోంది. ఎన్నికల సంఘానికి మాత్రమే సరఫరా చేస్తోంది. చెరగని సిరాను దిల్లీలోని ‘కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌-నేషనల్‌ ఫిజికల్‌ లేబొరేటరీ’ ప్రత్యేకంగా ఈ కంపెనీ కోసమే అభివృద్ధిపరిచి ఇచ్చింది.

ప్రస్తుత లోక్‌సభ, దాంతో పాటే నిర్వహించే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే 12 లక్షల పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన సిరా సరఫరా ఇప్పటికే పూర్తయ్యిందని తయారీ సంస్థ వెల్లడించింది. రూ.55 కోట్ల విలువైన 26.55 లక్షల సిరా బుడ్ల(వయల్స్‌)ను అందించినట్లు తెలిపింది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు 3.64 లక్షల వయల్స్‌, అత్యల్పంగా లక్షద్వీప్‌కు 125 వయల్స్‌ పంపించారు. ఒక్కో బుడ్డీలో 10 మిల్లీలీటర్‌ సిరా ఉంటుందని, 700 మంది ఓటర్ల వేలికి రాయడానికి వస్తుందని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.మహమ్మద్‌ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు రూ.36 కోట్ల విలువైన 25.98 లక్షల వయల్స్‌ సరఫరా చేశామన్నారు.

అక్కడ సిరాలో వేలిని ముంచుతారు

చెరిగిపోని సిరాను 25కు పైగా దేశాలకు మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ లిమిటెడ్‌ ఎగుమతి చేస్తోంది. కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేసియా, నేపాల్‌, దక్షిణాఫ్రికా, మాల్దీవులు, తుర్కియే తదితర దేశాలు మన సిరాను ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి వినియోగిస్తున్నాయి. అయితే, సిరా వినియోగించే విధానం వేర్వేరుగా ఉంటుంది. కంబోడియా, మాల్దీవులలో ఓటరు తన వేలిని సిరాలో ముంచాలి. బుర్కినాఫాసోలో కుంచెతో, తుర్కియేలో నాజిల్‌తో ఇంక్‌ ముద్ర వేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img