icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (7)

దేశంలో ఉగ్రవాదాన్ని నరేంద్రమోదీ సర్కారు నిర్మూలించింది. నక్సలిజం ఇప్పుడు అంత్యదశలో ఉంది. ఏపీ, తెలంగాణ, బిహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ సహా దేశంలో చాలాచోట్ల నక్సలిజాన్ని అంతమొందించాం.

Updated : 23 Apr 2024 06:49 IST

ఉగ్రవాదం అంతరించింది.. నక్సలిజం అంత్యదశలో ఉంది

- ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

దేశంలో ఉగ్రవాదాన్ని నరేంద్రమోదీ సర్కారు నిర్మూలించింది. నక్సలిజం ఇప్పుడు అంత్యదశలో ఉంది. ఏపీ, తెలంగాణ, బిహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ సహా దేశంలో చాలాచోట్ల నక్సలిజాన్ని అంతమొందించాం. మోదీని ఎన్నుకుంటే ఛత్తీస్‌గఢ్‌లోనూ మావోయిస్టులను రెండేళ్లలో ఏరివేస్తాం. దేశంలోని వనరులపై మైనారిటీలకు మొదటి హక్కు ఉందని కాంగ్రెస్‌ చెబుతోంది. వాటిపై పేదలు, ఆదివాసీలు, దళితులు, బీసీలకు హక్కు ఉందని మేం అంటున్నాం.


సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో కాంగ్రెస్‌ ఎందుకు పాల్గొనట్లేదు?

- కేరళలోని మత్తన్నూర్‌ ఎన్నికల సభలో సీఎం పినరయి విజయన్‌


 

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ కేరళలో చేపట్టిన ఉద్యమంలో కాంగ్రెస్‌ ఎందుకు పాల్గొనడంలేదో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ వివరణ ఇవ్వాలి. రాష్ట్రశాఖకు పార్టీ అధిష్ఠానం అలాంటి ఆదేశాలేమైనా ఇచ్చిందేమో?.. ఒకవేళ మా అంచనా సరికాదంటే ఆ విషయమైనా చెప్పాలి. మతం ప్రాతిపదికన నాగరిక దేశమేదీ పౌరసత్వాన్ని నిర్ణయించలేదు, శరణార్థుల్ని విభజించలేదు.


హరియాణాలో ఐఎన్‌ఎల్‌డీకి అకాలీదళ్‌ మద్దతు

చండీగఢ్‌: హరియాణాలో ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌కు (ఐఎన్‌ఎల్‌డీ) శిరోమణి అకాలీ దళ్‌ మద్దతు పలికింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ హరియాణా ఇన్‌ఛార్జి బల్వీందర్‌ సింగ్‌ తెలిపారు. తమకు మద్దతు పలకడం పట్ల ఐఎన్‌ఎల్‌డీ ప్రధాన కార్యదర్శి అభయ్‌ సింగ్‌ చౌటాలా కృతజ్ఞతలు తెలిపారు.


రాజ్యాంగాన్ని మార్చేందుకే.. ‘400 సీట్ల’ ప్రచారం

- కర్ణాటకలోని చన్నపట్నంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

రాజ్యాంగాన్ని మార్చడానికి పార్లమెంటులో అవసరమైన మూడోవంతు మెజార్టీ సాధించడం లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారు. అందుకే 400 సీట్ల లక్ష్యం కోసం మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటనలు చేస్తోన్న ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపా నేతలను ప్రధాని ఎందుకు అడ్డుకోవడం లేదు? వారికి లోలోపల ఆ ఆలోచన ఉండడంవల్లనే అలా మిన్నకుంటున్నారు. ముస్లింలీగ్‌ ఆలోచనను మా మ్యానిఫెస్టో ప్రతిబింబిస్తోందన్న విమర్శలపై చర్చకు సిద్ధం.


రాహుల్‌ వలలో పడొద్దు

- అమేఠీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ

యనాడ్‌లో ఎన్నికలు ముగిశాక ఈ నెల 26 తర్వాత రాహుల్‌గాంధీ ఇక్కడికి వస్తారు. కులం పేరుతో ప్రజల మధ్య అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తారు. మీరంతా తన కుటుంబమని చెబుతారు. ఆ వలలో ఎవరూ పడొద్దు. ఆయన ఇక్కడి ఎంపీగా ఉన్నప్పుడు ప్రజలకు తాగునీరైనా రప్పించలేకపోయారు. మోదీ సర్కారు అది చేసి చూపింది.


కాంగ్రెస్‌ది బుజ్జగింపు రాజకీయం

- ఛత్తీస్‌గఢ్‌లోని లొర్మిలో భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా

టుబ్యాంకు రాజకీయాల్లో కాంగ్రెస్‌ అనేక బుజ్జగింపులకు పాల్పడుతుంది. సొంత అన్నదమ్ముల మధ్యా చిచ్చు పెడుతుంది. దీనికి భిన్నంగా.. అన్ని వర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా రాజకీయ సంస్కృతినే ప్రధాని మోదీ మార్చేశారు. పనిచేసే తీరును మార్చారు. రాముడి వ్యతిరేకులైన పార్టీకి ప్రజల మద్దతు లభిస్తుందా?


థరూర్‌పై పోటీ..  వామపక్షం తప్పు

- తిరువనంతపురంలో మీడియాతో సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌

కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌పై పోటీకి అభ్యర్థిని నిలబెట్టడం కేరళలోని వామపక్ష కూటమి ప్రభుత్వం తప్పు. థరూర్‌ రాజనీతిజ్ఞుడు. ఆయన మాట్లాడితే అంతర్జాతీయ నేతలూ వింటారు. భాజపా ఉచ్చులో వామపక్షాలు చిక్కుకోకూడదు. పార్టీల కంటే దేశ శ్రేయస్సు ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img