icon icon icon
icon icon icon

ప్రత్యేక బోడోలాండే ఎజెండా

ప్రత్యేక బోడోలాండ్‌ డిమాండుతోపాటు అభివృద్ధి అంశాలే ఎజెండాగా అస్సాంలోని 5 నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీన రెండో విడత పోలింగ్‌ జరగనుంది. నగావ్‌, దరాంగ్‌-ఉదాల్‌గురీ, దిఫూ (ఎస్టీ), సిల్చర్‌ (ఎస్సీ), కరీంగంజ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి.

Updated : 25 Apr 2024 04:40 IST

పౌరసత్వం, అభివృద్ధి అంశాలూ ముఖ్యమే
అస్సాంలో రెండో విడత పోలింగ్‌కు సిద్ధం
5 నియోజకవర్గాల్లో పోటాపోటీ

ప్రత్యేక బోడోలాండ్‌ డిమాండుతోపాటు అభివృద్ధి అంశాలే ఎజెండాగా అస్సాంలోని 5 నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీన రెండో విడత పోలింగ్‌ జరగనుంది. నగావ్‌, దరాంగ్‌-ఉదాల్‌గురీ, దిఫూ (ఎస్టీ), సిల్చర్‌ (ఎస్సీ), కరీంగంజ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం డిమాండుతోపాటు  పౌరసత్వం, విదేశీయుల రాకపై నిరసన,  నిరుద్యోగం,  వరదలు, పేదరికం, అభివృద్ధి ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి.

మత రాజకీయాల కరీంగంజ్‌

కరీంగంజ్‌లో మత రాజకీయాలదే ముఖ్య పాత్ర. ఇక్కడ కృపానాథ్‌ మల్లాను భాజపా బరిలోకి దించింది. ఏఐయూఎఫ్‌ తరఫున సహబుల్‌ ఇస్లాం చౌధురి, కాంగ్రెస్‌ తరఫున హఫీజ్‌ రషీద్‌ అహ్మద్‌ చౌధురి పోటీ చేస్తున్నారు. భాజపా అభివృద్ధి ఎజెండాతో ప్రచారం చేస్తోంది. సమాన అభివృద్ధి అవకాశాలను కల్పిస్తానని మైనారిటీలకు సిటింగ్‌ ఎంపీ మల్లా హామీ ఇస్తున్నారు. ఇక్కడ 86.84 శాతం మంది బెంగాలీ మాట్లాడతారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 56.4శాతం, హిందువులు 42.5శాతం ఉన్నారు.  


మత, ప్రాంతీయ అస్తిత్వ పోరాట దరాంగ్‌-ఉదాల్‌గురీ

త, ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలకు కేంద్రంగా దరాంగ్‌-ఉదల్‌గురీ నియోజకవర్గం నిలుస్తోంది. మంగల్‌దోయ్‌గా ఉండే ఇది డీలిమిటేషన్‌ తర్వాత దరాంగ్‌-ఉదల్‌గురీగా మారింది. 1979 నుంచి ఆరేళ్లపాటు విదేశీయుల వ్యతిరేక ఉద్యమం ఈ ప్రాంతంలో సాగింది. బంగ్లాదేశ్‌ వలసలకు వ్యతిరేకంగా ఇది సాగింది. ప్రస్తుతం హిందు, ముస్లిం, క్రిస్టియన్ల సంగమంగా ఈ నియోజకవర్గం ఉంది. ఇందులో సగం ప్రాంతం బోడోలాంగ్‌ ప్రాంతీయ రీజియన్‌లో (బీటీఆర్‌), మిగతా సగం దాని బయట ఉంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్‌, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌) తలపడుతున్నాయి. బోడోలాండ్‌ ఇక్కడ ప్రధాన ఎన్నికల అంశంగా ఉంది. ఇక్కడ పేదరికం, నిరుద్యోగం, వరదలు, రోడ్ల సమస్యలున్నాయి.


స్వతంత్ర రాష్ట్ర హోదా డిమాండుతో దిఫూ

రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ను బలోపేతం చేసి ఆర్టికల్‌ 244 (ఎ) కింద అస్సాంలోని కొండ ప్రాంత జిల్లాలకు స్వతంత్ర రాష్ట్ర హోదా ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండు చేస్తున్నారు. దిఫూలో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్‌, స్వతంత్ర రాష్ట్ర డిమాండు కమిటీ (ఏఎస్‌డీసీ), గణ సురక్ష పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నారు. కర్బీ ఆంగ్‌లాంగ్‌ ప్రాంతంలో చాలామంది ప్రజలు వెదురుతో నిర్మించిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. నిరుపేదలైన వారికి ఎన్నికలప్పుడు మద్యం, మాంసం పంపిణీ చేసి ఓట్లు వేయించుకుంటున్నాయని స్వతంత్ర అభ్యర్థి కతర్‌ ఆరోపించారు.


పౌరసత్వ సమస్యల నగావ్‌

గావ్‌లో పౌరసత్వ సమస్యతోపాటు పేదరికం, నిరుద్యోగం ఉన్నాయి. డీలిమిటేషన్‌తో ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా     50శాతం దాటింది. వలస ముస్లింల సంఖ్య ఇక్కడ అధికం. 2019లో గెలిచిన ఈ సీటును మళ్లీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఇక్కడ 51శాతం ముస్లింలు, 49 శాతం హిందువులు ఉన్నారు. అయితే ఇక్కడ     ఏఐయూడీఎఫ్‌ పోటీలో ఉండటంతో కాంగ్రెస్‌ మైనారిటీ ఓటు బ్యాంకుకు గండి పడవచ్చని భావిస్తున్నారు. జనం మాత్రం అభివృద్ధి, నిరుద్యోగం, పేదరికం అంశాలనే ప్రధానమైనవిగా భావిస్తున్నారు.


సరైన సౌకర్యాల్లేని సిల్చర్‌

సిల్చర్‌లో రాష్ట్ర మంత్రి పరిమళ్‌ శుక్లాబైద్యను భాజపా బరిలోకి దింపింది. ఆయనపై కాంగ్రెస్‌ యువ నేత సూర్య కాంత సర్కార్‌ పోటీ చేస్తున్నారు. తృణమూల్‌ పార్టీ నుంచి రాధేశ్యామ్‌ బిశ్వాస్‌ బరిలోకి దిగారు. బారక్‌ లోయలో అభివృద్ధే ప్రధాన అంశంగా ఉంది. అక్కడి ప్రజలు ఇప్పటికీ సరైన సౌకర్యాలను నోచుకోలేదు. హాఫ్లాంగ్‌ నుంచి రోడ్డు పనులు చేపట్టినా ఇంకా పూర్తి కాలేదు. బారక్‌లో చాలా రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో వివక్ష ప్రధాన సమస్యని స్థానికుడొకరు తెలిపారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలిచ్చామని ప్రభుత్వం చెబుతోందని, బారక్‌ లోయలోని వారికి అందులో ఒక శాతం కూడా దక్కలేదని చెబుతున్నారు. ఆర్థిక, ఉద్యోగ, సాంస్కృతిక రంగాల్లో ఈ ప్రాంతం వెనుకబడింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండు అధికంగా ఉంది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img