icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (7)

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు. భారత్‌జోడో యాత్ర చేపట్టిన రాహుల్‌గాంధీ- ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4 తర్వాత ‘కాంగ్రెస్‌ ఢూండో’ (కాంగ్రెస్‌ను వెతకండి) యాత్ర చేపట్టాల్సి వస్తుంది.

Updated : 03 May 2024 06:41 IST

చివరకు కాంగ్రెస్‌ ఢూండో యాత్ర

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు. భారత్‌జోడో యాత్ర చేపట్టిన రాహుల్‌గాంధీ- ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4 తర్వాత ‘కాంగ్రెస్‌ ఢూండో’ (కాంగ్రెస్‌ను వెతకండి) యాత్ర చేపట్టాల్సి వస్తుంది. రెండుదశల పోలింగ్‌లో కాంగ్రెస్‌ ఎక్కడా లేదు. భాజపా మాత్రం సెంచరీ కొట్టి 400+ సీట్ల దిశగా దూసుకుపోతోంది.

యూపీలోని బరేలీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా


బలిదానమే మా నాన్నకొచ్చిన ఆస్తి

మా నాన్న రాజీవ్‌గాంధీ తన తల్లి నుంచి ఆస్తిని కాకుండా బలిదానాన్ని వారసత్వంగా స్వీకరించారు. మా నానమ్మ ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలర్పించారు. అదే రీతిలో నా తండ్రి ప్రాణాలు కోల్పోయారు. వంశపారంపర్య రాజకీయాలంటూ ఇందిర వంటి మహిళ గురించి అర్థరహితంగా మాట్లాడడమే తప్పిస్తే మా కుటుంబం చేసిన త్యాగాలను ప్రధాని మోదీ అర్థం చేసుకోలేరు. వంచకులుగా దూషించినా, కేసులు పెట్టినా, ఇళ్లు ఖాళీ చేయించినా, ఆఖరికి చంపినా సరే మాకున్న దేశభక్తిని ఎవరూ మా హృదయాల్లోనుంచి తొలగించలేరు.

 మధ్యప్రదేశ్‌లోని మురైనాలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ


మాకు బుల్డోజర్ల అవసరం రాలేదు

మేం అధికారంలో ఉన్నప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు కాపాడడానికి ప్రస్తుత సర్కారు మాదిరిగా బుల్డోజర్ల అవసరం రాలేదు. హిందూ-ముస్లింల మధ్య అల్లర్లకే మేం ఆస్కారమివ్వలేదు. అన్ని మతాలను, అన్ని విశ్వాసాలను గౌరవించాం.

 యూపీలోని మైన్‌పురీలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి


భర్త అడుగుజాడల్లో వెళ్తా

అన్యాయాలు, నియంతృత్వ శక్తులపై పోరాటంలో భర్త అడుగుజాడల్లో వెళ్తా. విలువలతో రాజీపడకుండా ఆయన జైలుకు వెళ్లారు. తలొగ్గడమనేది గిరిజనుల డీఎన్‌యేలోనే లేదు. నా భర్తను అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన అమాయకుడు. ముందస్తు కుట్రతో ఆయన్ను ఇరికించారు. ఈడీ ప్రతాపమంతా విపక్షనేతలపైనే ఎందుకు ఉంటోందో నాకు అర్థం కావడం లేదు.  

 పీటీఐ ఇంటర్వ్యూలో ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ భార్య కల్పనా సోరెన్‌


ఆర్జేడీ అంటే అవినీతి, ఆటవిక పాలన

లాలూప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ)లో ఆర్‌ అంటే రిశ్వత్‌ఖోర్‌ (అవినీతి), జె అంటే జంగిల్‌రాజ్‌ (ఆటవిక రాజ్యం), డీ అంటే దల్‌దల్‌ (మురికిగుంట). దేశంలో అవినీతి నిర్మూలనకు ప్రధాని మోదీ శ్రమిస్తుంటే విపక్ష సంకీర్ణం మాత్రం అవినీతిపరుల్ని రక్షించే ప్రయత్నాలు చేస్తోంది. కుటుంబపాలనకు అది మారుపేరు. కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్‌ నేతలు వేర్వేరు కుంభకోణాల్లో ఉన్నారు. అహంకార (ఘమండియా) కూటమికి మరోపేరు.. అవినీతి.

 బిహార్‌లోని అరరియా, ముజఫర్‌పుర్‌ సభల్లో భాజపా అధ్యక్షుడు నడ్డా


మోదీ వాస్తవాలు చెప్పరు.. దృష్టి మళ్లిస్తారు

ప్రధాని మోదీ ప్రసంగాల్లో వాస్తవాలు, వాస్తవికత ఉండవు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన అంశాల గురించి మాట్లాడకుండా ఆయన దృష్టి మళ్లిస్తారు. ఇలాంటి ప్రధానిని ఇంతకుముందు చూడలేదు. మోదీ ఎక్కువగా ప్రచారంలో పాల్గొనేందుకే మహారాష్ట్రలో పోలింగ్‌ను ఐదు దశలకు విస్తరించారు. ఇండియా కూటమి నెగ్గితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకువస్తుందని ప్రధాని పదేపదే చెప్పడం వెనక ఉద్దేశం సమాజంలో ఉద్రిక్తత రేకెత్తించడమే.

 కొల్హాపుర్‌లో మీడియాతో ఎన్సీపీ (శరద్‌చంద్రపవార్‌) అధ్యక్షుడు శరద్‌ పవార్‌


భాజపాకు 400 ఓ జోక్‌.. 200 కూడా సవాలే

ప్రస్తుత ఎన్నికల్లో 400 పైగా సీట్లు సాధిస్తామని భాజపా చెప్పుకోవడం ఓ జోక్‌. 300 దాటడమే అసాధ్యం. 200 తెచ్చుకోవడమూ సవాలే. దిగువసభలో మెజారిటీని భాజపా కోల్పోవడం ఖాయం. కేరళ, తమిళనాడు, ఏపీలో ఒక్కసీటూ ఆ పార్టీకి రాదు. కర్ణాటక, తెలంగాణలలో సిట్టింగ్‌ స్థానాలు నిలబెట్టుకోవడం కష్టమే. వారికి దక్షిణాది మొత్తంమీద 2019 కంటే దారుణమైన ఫలితాలే వస్తాయి. దేశంలో ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన 190 స్థానాల్లో మాకు గొప్ప ప్రభంజనం ఉందని చెప్పను. ప్రభుత్వానికి అనుకూలంగా లేదనేది మాత్రం కచ్చితంగా వాస్తవం. మేం అనుకున్నదానికంటే చాలా ముందంజలో ఉన్నాం.

 పీటీఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img