icon icon icon
icon icon icon

ఊహలపైనే మోదీ ప్రసంగాలు

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

Updated : 09 May 2024 06:33 IST

ప్రధానిపై ప్రియాంకా గాంధీ విమర్శలు

రాయ్‌ బరేలీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. అబద్ధాల ప్రచారంతో వారంతా విసుగెత్తిపోయారని తెలిపారు. ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో ఎక్కువగా ఊహాశక్తికి పనిచెబుతున్నారని విమర్శించారు. వాస్తవాల ఆధారంగా అస్సలు మాట్లాడటంలేదని ఆక్షేపించారు. 1985లో భారీ మెజర్టీతో అధికారంలోకి వచ్చిన రాజీవ్‌గాంధీ ప్రభుత్వం షాబానో కేసును మార్చినట్లే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే అయోధ్యలో రామమందిరానికి అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మార్చేస్తారన్న మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రియాంక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పీటీఐ వార్తాసంస్థకు బుధవారం రాయ్‌బరేలీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలపై మోదీ మాట్లాడాలంటూ సవాలు విసిరారు. దేశంలో ఇప్పటివరకూ జరిగిన మూడు దశల పోలింగ్‌ను విశ్లేషిస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అర్థమైందన్నారు. అబద్ధపు ప్రచారాల పట్ల ఓటర్లు విసుగెత్తిపోయినట్లు తాను వెళ్లిన చోటల్లా గమనించానని తెలిపారు. ‘‘వారంతా.. మీడియా, రాజకీయ వేదికలపై తమ సమస్యలపై చర్చ జరగాలని, పరిష్కారాలుండాలని కోరుకుంటున్నారు. నిరుద్యోగులకు, పెరిగిపోయిన ధరల కట్టడికి, రైతులకు, కార్మికులకు, సమస్యల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఏం చేసిందో, తెలుసుకోగోరుతున్నారు’’ అని ప్రియాంక వెల్లడించారు. ఈసారి ఎన్‌డీయేకు 400..భాజపాకు 370 సీట్లన్న కాషాయ దళం అంచనాలు తలకిందులవుతాయని జోస్యం చెప్పారు. లోక్‌సభలో 400 సీట్లకు పైగా సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా అభ్యర్థులు, నేతలే బహిరంగంగా ప్రకటించారని ప్రియాంక తెలిపారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ ప్రజల్లోకి తీసుకువెళ్తోందని వివరించారు.

పారిశ్రామికవేత్తలకు రూ.16 లక్షల కోట్ల రుణ మాఫీ

పారిశ్రామికవేత్తలతో భాజపాకు విడదీయరాని అనుబంధం ఉందని ప్రియాంక విమర్శించారు. వారికి చెందిన రూ.16 లక్షల కోట్ల విలువైన రుణాలనుమాఫీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ ప్రజల, దేశ సంపదను కాపాడిందన్నారు. ప్రజలంతా తమ గురించి..తమ చిన్నారుల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img