icon icon icon
icon icon icon

రాజ్యాంగాన్ని 80సార్లు సవరించిన కాంగ్రెస్‌

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని 80 సార్లు సవరించింది. ఇప్పుడేమో మేం రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రచారం చేస్తోంది.

Published : 11 May 2024 05:34 IST

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని 80 సార్లు సవరించింది. ఇప్పుడేమో మేం రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రచారం చేస్తోంది. రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కాంగ్రెస్‌ అనుసరించిన తప్పుడు ఆర్థిక విధానాలే ప్రజల్ని పేదరికంలో ఉంచాయి.

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ


మోదీతో ప్రజాస్వామ్యానికి ముప్పు

ప్రధాని మోదీ వల్ల పార్లమెంటుకు, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉంది. అలాంటి వారితో పొత్తు పెట్టుకోవడానికి మేం ఇష్టపడం. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ల అరెస్టు వెనుక కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉంది.

పుణెలో విలేకరులతో ఎన్సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్‌


పాక్‌ అంటే భాజపా నేతలకు ప్రేమ

అధికార పార్టీ భాజపాకు పాకిస్థాన్‌ అంటే ప్రేమ. ఎలాంటి ఆహ్వానం అందుకోకుండానే ప్రధాని మోదీ 2015లో ఆకస్మికంగా ఆ దేశ పర్యటనకు వెళ్లారు. పాక్‌ జాతిపిత మహమ్మద్‌ అలీజిన్నాను లౌకికవాదిగా ఆడ్వాణీ 2005లో చెప్పారు. వాజ్‌పేయీ పాక్‌కు బస్సుయాత్ర చేశారు. ఇదంతా చరిత్రలో లిఖితమైంది. భాజపా బలం ఉత్తరాదిలో సగానికి పడిపోతుంది. దక్షిణాన తుడిచిపెట్టుకుపోతుంది.

పీటీఐ ఇంటర్వ్యూలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్‌ బఘెల్‌


ప్రచార ‘టెంపో’ మావైపే ఉంది

లోక్‌సభ సీట్లలో సగానికి పైగా స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచార ‘టెంపో’ (లయ) మావైపే ఉంది. పవనాలన్నీ విపక్షం వైపే వీస్తున్నాయి.

కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ (కాంగ్రెస్‌కు టెంపోల్లో డబ్బు అందిందన్న ప్రధాని ఆరోపణపై)


టీఎంసీ అంటే తుష్టీకరణ్‌, మాఫియా, కరప్షన్‌

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)లో టీ అంటే తుష్టీకరణ్‌ (బుజ్జగింపు), ఎం అంటే మాఫియా, సి అంటే కరప్షన్‌ (అవినీతి). మా.. మాటీ.. మనుష్‌ నినాదం కాస్తా ముల్లా.. మదర్సా.. మాఫియాలా మారింది. సందేశ్‌ఖాలీ ఘటనపై మమతాబెనర్జీ మౌనం వహించారు. దోషులు నేలమాళిగల్లో దాక్కొన్నా వదిలిపెట్టం. చొరబాటుదారులకు ఆమెకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తున్నారు. శరణార్థ హిందువులు, సిక్కులకు మాత్రం పౌరసత్వం ఇవ్వొద్దని అంటున్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ప్రతీ అంగుళం భారత్‌దే. జేఎంఎం సర్కారు అనేక కుంభకోణాల్లో ఇరుక్కుంది. పేదల డబ్బు కట్టలుకట్టలుగా బయటపడుతోంది.

పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌ సభల్లో కేంద్రమంత్రి అమిత్‌ షా


అవినీతిలో కూరుకున్న విపక్షం

విపక్ష ఇండియా కూటమి అంటే అవినీతిపరుల కూడిక. దేశం వృద్ధిపథాన దూసుకువెళ్లాలంటే కమలానికే ఓటువేయాలి. కాంగ్రెస్‌, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, భారాస.. ఇవన్నీ అవినీతిలో కూరుకుపోయాయా లేదా? కేజ్రీవాల్‌, సిసోదియా, సత్యేందర్‌ జైన్‌ ఎక్కడున్నారు? రాహుల్‌, సోనియా, హుడ్డా, లాలూ బెయిల్‌పై ఉన్నారా లేదా? కుటుంబ రాజకీయాలే తప్పిస్తే ప్రజల గురించి విపక్షాలకు పట్టదు.

హరియాణాలోని పంచ్‌కులాలో భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img