icon icon icon
icon icon icon

ఆ లిస్ట్‌ నకిలీది.. ఈ 9 సీట్లకు త్వరలోనే అభ్యర్థుల జాబితా : కాంగ్రెస్‌

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన జాబితా నకిలీది అని హరియాణా కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.

Updated : 22 Apr 2024 19:47 IST

చండీగఢ్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ సామాజిక మాధ్యమాల్లో తొమ్మిది మంది అభ్యర్థులతో చక్కర్లు కొడుతోన్న జాబితా నకిలీదని హరియాణా కాంగ్రెస్‌ (Congress) స్పష్టం చేసింది. తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ట ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు హరియాణా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్‌భాన్‌ మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం ఉందని, అంతకంటే ముందే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని వెల్లడించారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతోన్న జాబితా నకిలీది’’ అని క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్న వారి సమాచారం సేకరించి విచారణ చేపడతామన్నారు.

ఎన్నికలకు ముందే భాజపాకు తొలి విజయం.. ఆ ఎంపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం..!

హరియాణాలో మొత్తం 10 స్థానాలు ఉండగా.. ‘ఇండియా’ కూటమిలో భాగంగా కురుక్షేత్ర నుంచి ఆప్‌ తరఫున ఆ పార్టీ హరియాణా చీఫ్‌ సుశీల్‌గుప్తా బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ఇంకా అభ్యర్థులను మాత్రం ఖరారు చేయలేదు. ఇప్పటికే భాజపా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. మరోవైపు, అభ్యర్థుల ఖరారులో జాప్యం జరుగుతుండటంతో ప్రత్యర్థి పార్టీల నుంచి కాంగ్రెస్‌ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల కర్నాల్‌లో హరియాణా సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నా.. అభ్యర్థులను మాత్రం నిలబెట్టలేకపోతోందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల బరి నుంచి పారిపోతోందంటూ విమర్శించారు. ఇదిలాఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర శాఖలో అంతర్గత పోరు వల్లే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్‌ ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img