icon icon icon
icon icon icon

Rajeev Chandrasekhar: ఓటు వేయలేదన్న కేంద్ర మంత్రి.. విపక్షాల విమర్శలు

Rajeev Chandrasekhar: లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తన ఓటుహక్కును వినియోగించుకోలేదు. దీంతో ఆయనపై విపక్షాలు పలు విమర్శలు గుప్పించాయి.

Published : 27 Apr 2024 18:47 IST

తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) భాగంగా శుక్రవారం రెండోవిడత పోలింగ్‌ జరిగింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో పలు రంగాల  ప్రముఖులతో పాటు సామాన్య పౌరులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrasekhar) ఓటు వేయకపోవడం విమర్శలకు దారితీసింది.

రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేరళలోని తిరువనంతపురం (Thiruvananthapuram) స్థానం నుంచి భాజపా (BJP) అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, అతని ఓటు మాత్రం బెంగళూరులో ఉంది. ఈ రెండు స్థానాలకు ఏప్రిల్‌ 26నే పోలింగ్‌ జరిగింది. దీంతో తాను బరిలో ఉన్న స్థానంలో ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

‘‘ఎన్నికల వేళ తిరువనంతపురంలో ఉండటానికే నేను అధిక ప్రాధాన్యమిచ్చా. ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించబోతున్నాయని విశ్వసిస్తున్నా. అందుకే పోలింగ్‌ రోజున ఈప్రాంత ప్రజలకు ప్రతినిధిగా ఇక్కడ ఉండటం నా కర్తవ్యంగా భావించా. అయితే గత కొన్నేళ్లుగా బెంగళూరులో ఓటుహక్కు వినియోగించుకుంటున్న నేను ఈసారి ఓటు వేయకపోవడం బాధనిపించింది. దీనికి ఎంతగానో చింతిస్తున్నా. సరైన సమయంలో నా ఓటును ఇక్కడికి బదిలీ చేసుకోవడం సాధ్యపడలేదు. అందుకే, ఈసారి ఎన్నికల్లో ఓటు వేయలేకపోయా’’ అని రాజీవ్‌ వెల్లడించారు.

ఎడ్లబళ్లలో.. చక్రాల కుర్చీల్లో.. నిబద్ధత చాటుకున్న ఓటర్లు

అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ‘‘ఓటు వేయడం అనేది ప్రతీ పౌరుడి ప్రాథమిక హక్కుతో పాటు బాధ్యత కూడా. అనుకుంటే ఆయన హెలికాప్టర్‌లో వెళ్లి ఓటు వేసి ఇక్కడికి రావొచ్చు. కానీ ఇలా పోలింగ్‌కు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే’’ అని సీపీఎం, సీపీఐ నేతలు దుయ్యబట్టారు.

తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ గత మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ ఆయన మరోసారి బరిలో నిలిచారు. దీంతో థరూర్‌కు గట్టి పోటీనిచ్చేందుకే భాజపా ఈ కేంద్రమంత్రిని నిలబెట్టింది. కేరళలో భాజపా ఇప్పటివరకు ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవలేదు. ఈసారి రాజీవ్‌ చంద్రశేఖర్‌తో ఎలాగైనా ఈ రాష్ట్రంలో ఖాతా తెరవాలని కమలదళం తీవ్రంగా ప్రయత్నించింది. కేరళలో మొత్తం 20 స్థానాలకు ఒకేవిడతలో శుక్రవారం పోలింగ్ పూర్తయ్యింది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img