icon icon icon
icon icon icon

Congress: కాంగ్రెస్‌కు ఇందౌర్‌ అభ్యర్థి షాక్‌.. నామినేషన్‌ వెనక్కి తీసుకుని భాజపాలో చేరిక

Congress: ఇందౌర్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. పోటీ నుంచి వైదొలిగి భాజపాలో చేరారు.

Published : 29 Apr 2024 13:02 IST

ఇందౌర్‌: లోక్‌సభ ఎన్నికల (Lok sabha Elections) వేళ కాంగ్రెస్‌ (Congress)కు గట్టి షాక్‌ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ (Indore) లోక్‌సభ స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థి అక్షయ్‌ కాంతి బమ్‌ అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు. చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడమే గాక.. పార్టీని వీడి భాజపా (BJP)లో చేరారు.

ఇందౌర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఏప్రిల్‌ 29) ఆఖరి తేదీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్‌ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆయన వెంట భాజపా ఎమ్మెల్యే రమేశ్ మెండోలా ఉండటం గమనార్హం.

అక్షయ్‌ కాషాయ పార్టీలో చేరిన విషయాన్ని రాష్ట్ర మంత్రి, భాజపా నేత కైలాశ్‌ విజయ్‌వర్గియ ధ్రువీకరించారు. ఆయనతో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్‌ చేసి పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇందౌర్‌ నుంచి భాజపా తరఫున సిట్టింగ్‌ ఎంపీ శంకర్‌ లల్వానీ బరిలో ఉన్నారు. బీఎస్పీతో పాటు స్వతంత్రులు కొంతమంది ఇక్కడ పోటీ చేస్తున్నారు.

సింధియాల పోరు.. తల్లి ఓటమి కోసం ప్రచారం చేసిన వేళ!

ఇప్పుడు భాజపాకు ప్రధాన పోటీదారు అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి వెనక్కి తగ్గడంతో శంకర్‌ విజయం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. అయితే, ఈ సాయంత్రం వరకు పోటీలో ఉన్న ఇతరులు కూడా నామినేషన్లను ఉపసంహరించుకుంటే సూరత్‌ తరహాలోనే ఇక్కడ కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.

ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ కుంభానీ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే పోటీలో ఉన్న ఇతరులు కూడా నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో భాజపా నేత ముకేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా గెలుపొందినట్టు ఆర్వో ప్రకటించడంతో లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు తొలి విజయం దక్కినట్లయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img