icon icon icon
icon icon icon

Amritpal Singh: లోక్‌సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌..?

ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌ జైలు నుంచే ఎన్నికల బరిలో దిగేందుకు వ్యూహరచన చేస్తున్నాడు.

Published : 26 Apr 2024 10:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏడాది క్రితం పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని తెరపైకి తెచ్చి కలకలం రేపిన ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) ఇప్పుడు ఎన్నికలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఖదూర్‌ సాహెబ్‌ లోక్‌ సభ స్థానం నుంచి బరిలోకి దిగవచ్చని ప్రచారం జరుగుతోంది. అమృత్‌పాల్‌  ప్రస్తుతం డిబ్రూగఢ్‌ జైల్లో ఉన్నాడు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు సన్నాహలు చేసుకుంటున్నట్లు అతడి లాయర్‌ రాజ్‌దేవ్‌ సింగ్‌ ఖల్సా బుధవారం ప్రకటించారు. జైల్లో అతడితో భేటీ అనంతరం ఈ విషయం చెప్పారు.

మరోవైపు అమృత్‌పాల్‌ తండ్రి తార్సెమ్‌ సింగ్‌ మాత్రం ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. తన కుమారుడిని గురువారం జైల్లో కలుసుకున్న తర్వాత మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో పోటీ అంశంపై అమృత్‌పాల్‌ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మేము ఆ విషయం మాట్లాడేందుకే వచ్చాం’’ అని పేర్కొన్నాడు. నిబంధనల కారణంగా జైలు అధికారులు తమకు తగినంత సమయం ఇవ్వలేదని తెలిపాడు. 

జైల్లో ఉన్న ఖైదీ ఎన్నికల్లో పోటీచేయడం భారత్‌లో ఇదే తొలిసారి కాదు. 1989లో శిరోమణి అకాలీదళ్‌ నేత సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. జైల్లో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం వారు ప్రమాణస్వీకారం చేసేందుకు అవకాశం కల్పిస్తారు.

రెండేళ్ల క్రితం వరకు అనామకుడే..

అమృత్‌సర్‌ జిల్లా అజ్‌నాలా పోలీసులు అమృత్‌పాల్‌సింగ్‌ అనుచరుడు లవ్‌ప్రీత్‌ తుపాన్‌ను 2023లో అరెస్టు చేశారు. దీంతో అప్పుడు వందల మంది పోలీస్‌స్టేషన్‌పై దాడిచేశారు. ఈ ఘటనతో అమృత్‌పాల్‌ పేరు దేశంలో మార్మోగింది. 2022 ఫిబ్రవరి వరకు అతడు ఎవరికీ తెలియని ఓ సాధారణ వ్యక్తి. చాలా కాలం దుబాయిలో ఉన్నాడు. ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్‌సిద్ధూ మరణంతో అమృత్‌పాల్‌ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటి నుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్‌నే స్థావరంగా ఎంచుకున్నాడు. వేర్పాటువాది జర్నైల్‌ సింగ్‌ భింద్రాన్‌వాలా శైలిలోనే అతడు కూడా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. అజ్‌నాలా ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపాడు. చివరికి జర్నైల్‌ సింగ్‌ గ్రామమైన రోడెవాల్‌లోని గురుద్వారాలో అతడిని అరెస్టు చేసి డిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img