icon icon icon
icon icon icon

Congress: టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు : ఖర్గే

ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

Updated : 10 May 2024 14:54 IST

హైదరాబాద్‌: ఇచ్చిన  హామీల మేరకు పథకాలు అమలు చేశామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదైతే చెబుతామో అది కచ్చితంగా చేసి చూపిస్తామన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. 

‘‘చేసిన అభివృద్ధి గురించి చెప్పి భాజపా ఓట్లు అడగదు. కాంగ్రెస్‌పై నిందలు మోపడం ద్వారా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్‌ తమకు పోటీయే కాదంటూనే పదేపదే విమర్శిస్తోంది. మా పార్టీకి భయపడుతున్నందునే పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. నల్లధనం వెలికితీస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారు. నల్లధనం ప్రయోజనాలు వారి మిత్రులకే అందజేశారు. ఎన్నికల ప్రకటన తర్వాత అదానీ, అంబానీ గురించి మేం మాట్లాడలేదంటున్నారు. టెంపోల్లో కాంగ్రెస్‌ నేతలకు డబ్బులు ముడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపిస్తున్నారు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో మీరు చూశారా? టెంపోల్లో డబ్బు తరలిస్తుంటే ఐటీ, కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి? అదానీ, అంబానీ నుంచి డబ్బులు వెళ్తుంటే వారి ఇళ్లలో ఈడీ, ఐటీ సిబ్బంది సోదాలు చేయండి. ఇలాంటి  వ్యాఖ్యలు చేయడం ప్రధాని స్థాయికి తగదు. 

ధనవంతుల ఆస్తులు లాక్కుని పంచుతామనడం సిగ్గుచేటు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని గుర్తించాలి. అభివృద్ధిని గాలికొదిలేసి విపక్షంపై ఆరోపణలే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణకు పెద్ద ప్రాజెక్టులు ఏం తీసుకువచ్చారో కేంద్రం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో పేద మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తాం’’ అని మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img