icon icon icon
icon icon icon

Kharge: రాజ్యాంగాన్ని మార్చేందుకే.. ‘400 సీట్ల’ ప్రచారం : మోదీపై ఖర్గే విమర్శలు

రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైన మూడో వంతు మెజార్టీ లక్ష్యంగానే ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

Published : 22 Apr 2024 18:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఎన్డీఏ కూటమి 400 స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైన మూడోవంతు మెజార్టీ లక్ష్యంగానే ఆ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని చన్నపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. తమ ఎన్నికల హామీలు ముస్లింలీగ్‌ ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పడంపై ఖర్గే మండిపడ్డారు.

‘మూడింట రెండొంతుల మెజార్టీ కోసం మోదీ చూస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే ఈ మెజార్టీ కావాలి. అందుకే 400 సీట్లు రావాలని మోదీ పిలుపునిస్తున్నారు’ అని ఖర్గే పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటనలు చేస్తోన్న ఆర్ఎస్‌ఎస్‌, భాజపా నేతలను ప్రధాని ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. వారి మనసులోనే అది ఉందని, అదే జరగాలని కోరుకుంటున్నందువల్లే అటువంటి నేతలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.

‘మరో పుతిన్‌ తయారవుతున్నారు’.. మోదీపై శరద్‌ పవార్‌ విమర్శలు

తమ మేనిఫెస్టోను ముస్లిం లీగ్‌తో పోల్చడంపైనా ఖర్గే విరుచుకుపడ్డారు. యువతకు ఉద్యోగాలు, రైతులకు కనీస మద్దతు ధర వంటివి ఇవ్వడం ముస్లిం లీగ్‌ కిందకు వస్తాయా? అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. 1989 నుంచి గాంధీ కుటుంబీకులు ఎవరూ ప్రధానిగా, ముఖ్యమంత్రిగా కొనసాగలేదని చెప్పారు. అయినప్పటికీ గాంధీ కుటుంబంపై మోదీ మాత్రం విమర్శలు ఆపడం లేదన్నారు. మోదీ ‘హిట్‌ అండ్‌ రన్‌’ లాంటి వారని, స్థిరంగా నిలబడి సమస్యలపై చర్చించాలని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img