icon icon icon
icon icon icon

PM Modi Letter: ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ.. ఏం చెప్పారంటే..!

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను లాక్కుని తన ఓటుబ్యాంకు వర్గానికి కట్టబెట్టాలని చూస్తోన్న కాంగ్రెస్‌ ఉద్దేశాన్ని ప్రజల్లో ఎండగట్టాలని సూచిస్తూ ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖలు రాశారు.

Published : 30 Apr 2024 17:06 IST

దిల్లీ: రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్‌ (Congress)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విమర్శలు తీవ్రతరం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను లాక్కుని తన ఓటుబ్యాంకు వర్గానికి కట్టబెట్టాలని హస్తం పార్టీ చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని సూచిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీపడుతోన్న ఎన్డీయే అభ్యర్థులకు మోదీ తాజాగా వ్యక్తిగత లేఖలు రాశారు. అదేవిధంగా.. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా వారిని ప్రోత్సహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

మతప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమైనప్పటికీ.. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు విభజనవాద, వివక్షపూరిత ఆలోచనలు కలిగిఉన్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. పేదల కష్టార్జిత సంపదను తీసుకెళ్లి ఓటుబ్యాంకు వర్గాలకు ఇస్తామని, వారసత్వ పన్నును తిరిగి తీసుకొస్తామని చెప్పిందన్నారు. హస్తం పార్టీని అడ్డుకునేందుకు దేశం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో ఆయన్ను అత్యంత విలువైన కార్యకర్తగా ప్రశంసించారు. ఆయన తన 13వ ఏట ప్రజా జీవితాన్ని ప్రారంభించారని, 1980ల నుంచి తమ అనుబంధం కొనసాగుతోందని గుర్తుచేసుకున్నారు.

ఆ ఆత్మ వల్లే ‘మహా’ రాజకీయాల్లో అస్థిరత.. శరద్‌ పవార్‌పై ప్రధాని విమర్శలు

‘‘భారత్‌లోని కుటుంబాలు, ముఖ్యంగా పెద్దవారికి.. గత ఐదారు దశాబ్దాల్లో తాము ఎటువంటి కష్టాలు పడ్డామో తెలుసు. అయితే.. గత పదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఇంకా చాలా చేయాల్సిఉంది. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన జీవితాన్ని అందించేందుకు ఈ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవి. భాజపాకు వేసే ప్రతి ఓటు.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు భారత్‌ చేస్తోన్న ప్రయత్నాలకు ఊతమందిస్తుంది’’ అని తెలిపారు. ‘‘2047 కోసం 24/7 పని చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ’’ అని పేర్కొన్నారు. భాజపా అభ్యర్థిగా తన ప్రతీ క్షణాన్ని తోటి పౌరుల సంక్షేమం కోసం అంకితం చేస్తాననే హామీని ప్రతీ ఓటరుకు చేరవేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img