icon icon icon
icon icon icon

PM Modi: ఆ ఆత్మ వల్లే ‘మహా’ రాజకీయాల్లో అస్థిరత.. శరద్‌ పవార్‌పై ప్రధాని విమర్శలు

గతంలో కేంద్రమంత్రిగా వ్యవహరించిన ఎన్సీపీ (శరద్‌ పవార్‌) అధినేత శరద్‌ పవార్‌పై ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. 

Updated : 30 Apr 2024 14:55 IST

ముంబయి: ఆయనకు విజయం లభించకపోతే.. ఇతరుల మంచి పనులను కూడా శరద్‌పవార్‌ చెడగొడతారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయానికి ఏమీ చేయలేదని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత (Sharad Pawar)పై ప్రధాని (PM Modi) విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 

మహారాష్ట్రలోని అగ్రనాయకుడు ఒకరు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా చేసిన రోజుల్లో రైతుల అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయలేదని పవార్‌ను ఉద్దేశించి మోదీ పరోక్షంగా విమర్శించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు బకాయిల కోసం రైతులు చెరకు కమిషన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చిందన్నారు. ‘‘రాష్ట్రంలో ఓ ఆత్మ సంచరిస్తోంది (శరద్‌ పవార్‌ను ఉద్దేశిస్తూ). దానికి విజయం దక్కకపోతే ఇతరులు చేసిన మంచిని కూడా చెడగొడుతుంది. దాని చర్యలకు మహారాష్ట్ర ఓ బాధిత ప్రదేశం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ అనుమానమే? మరి రాయ్‌బరేలీలో ఎవరు?

ఓట్లను వృథా చేసుకోవద్దూ..

‘‘ఆ నాయకుడు 45 ఏళ్ల క్రితమే ఈ గేమ్‌ను ప్రారంభించారు. స్వలాభం కోసం రాష్ట్రాన్ని అస్థిర పర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా మహారాష్ట్రలోని చాలా మంది ముఖ్యమంత్రులు తమ పదవీకాలాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు’’ అని మోదీ ఆరోపించారు. లోక్‌సభలో సాధారణ మెజారిటీకి అవసరమైన కనీస స్థానాల్లో పోటీ చేయని వారిని ఎన్నుకుని ఓట్లను వృథా చేసుకోవద్దంటూ ప్రజలను ప్రధాని కోరారు.

దేశంలో బలమైన ప్రభుత్వం ఉన్నట్లయితే.. అది వర్తమానంతో పాటు భవిష్యత్తుపై దృష్టి సారించగలదని ప్రధాని పేర్కొన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పనితీరు.. 10 ఏళ్లలో మోదీ సర్కార్‌ అభివృద్ధి మధ్య తేడాను గమనించాలన్నారు. పేదరిక నిర్మూలన గురించి హస్తం పార్టీ చెప్పేవన్ని ఉత్తిమాటలేనని ఎద్దేవా చేశారు. పదేళ్లలో తమ ప్రభుత్వం 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగించిందని.. 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందిస్తోందని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img