icon icon icon
icon icon icon

Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ అనుమానమే? మరి రాయ్‌బరేలీలో ఎవరు?

Priyanka Gandhi Vadra: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేసే అవకాశాల్లేనట్లు తెలుస్తోంది. ఆమె ప్రచారానికే పరిమితం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Updated : 30 Apr 2024 12:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీ (Rae Bareli) లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ (Congress) పార్టీ అభ్యర్థులు ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అమేఠీ (Amethi) నుంచి రాహుల్‌ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)నే పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందుకు ప్రియాంక విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశాల్లేనట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. కేవలం ఒక సీటు నుంచి పోటీ చేయకుండా.. తాను దేశమంతా ప్రచారం చేస్తేనే పార్టీకి మంచి ఫలితాలొస్తాయని ఆమె భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. అంతేగాక, తాను పోటీ చేస్తే వారసత్వంపై విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్‌ నాయకురాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందుకే, ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకుండా విస్తృత ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మే 3వ తేదీ నుంచి ఆమె యూపీలో ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ

మరి, ప్రియాంక ఎన్నికలకు దూరంగా ఉంటే రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే సందిగ్ధత నెలకొంది. ఇక్కడ కూడా రాహుల్‌ గాంధీ పేరే వినిపిస్తోంది. అమేఠీ లేదా రాయ్‌బరేలీ నుంచి ఆయన పోటీపై 24 గంటల్లో హైకమాండ్‌ నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు అమేఠీ నుంచి పోటీ చేసేందుకు ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు స్థానాలకు ఐదో విడతలో భాగంగా మే 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు సమర్పించేందుకు మే 3 చివరి తేదీ. నేడు లేదా రేపు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఈ రెండు చోట్ల అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించినట్లు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సోమవారం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img