icon icon icon
icon icon icon

LS Polls: దేశం కోసం.. మా అమ్మ తన మంగళసూత్రాన్ని త్యాగం చేశారు: ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన నైతికతను వదిలేశారని ఆరోపించారు.

Published : 24 Apr 2024 00:13 IST

బెంగళూరు: యుద్ధం సమయంలో ఇందిరా గాంధీ తన బంగారాన్ని విరాళంగా ఇచ్చేశారని కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) గుర్తుచేశారు. తన తల్లి (సోనియా గాంధీ) మంగళసూత్రం దేశం కోసం త్యాగం చేశారని రాజీవ్‌ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో నిర్వహించిన ప్రచార సభలో ప్రియాంక ప్రసంగించారు. ప్రజల వద్ద ఉన్న బంగారం సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తుందని, మహిళల మంగళ సూత్రాలనూ వదలదంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘‘దేశంలో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? మహిళల మంగళ సూత్రాన్ని కాంగ్రెస్ లాక్కుంటుందంటూ రెండు రోజుల క్రితం వ్యాఖ్యలు వచ్చాయి. భారత్‌ గత 75 ఏళ్లుగా స్వేచ్ఛగా ఉంది. 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది. మీ బంగారాన్ని, మంగళసూత్రాన్ని ఎప్పుడైనా లాక్కుందా?’’ అని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ‘మంగళసూత్రం’ ప్రాధాన్యాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకుని ఉంటే.. అలా అనైతికంగా మాట్లాడేవారు కాదన్నారు.

‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!

అంతకుముందు చిత్రదుర్గ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై ప్రియాంక తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అతి పెద్ద నాయకుడైన ఆయన నైతికతను వదిలేశారని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘కేంద్రంలోని భాజపా.. విపక్షాల బ్యాంకు ఖాతాలను నిలిపివేసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల్ని జైలుపాలు చేసింది. ఎన్నికల వేళ ప్రతిపక్షాలను బలహీనపరిచే కుట్రలే ఇవన్నీ. ప్రజలు ప్రధాని నుంచి నైతిక విలువలను ఆశిస్తున్నారు. కానీ, ఆయన మాత్రం పలుకుబడి, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. సత్యమార్గాన్ని అనుసరించడం లేదు’’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img