icon icon icon
icon icon icon

Vote flights: ఎన్నికల కోసం ఎల్లలు దాటి.. స్వదేశానికి వేల మంది ఎన్నారైలు!

కేరళ (Kerala) నుంచి విదేశాలకు వెళ్లిన వారిలో.. లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేల మంది స్వదేశీ బాట పట్టారు.

Published : 24 Apr 2024 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) పండగలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కేరళ (Kerala) నుంచి విదేశాలకు వెళ్లినవారిలో.. వేల మంది స్వదేశీ బాట పట్టారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఆశ్రయిస్తున్నారు. గత రెండు రోజుల్లోనే దాదాపు 22వేలకు పైగా ఎన్నారై (NRI)లు కేరళకు వచ్చినట్లు అంచనా. పోలింగ్‌ తేదీ నాటికి ఈ సంఖ్య భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. కేరళలో మొత్తం 20 స్థానాలకు ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది.

కేరళ నుంచి లక్షల మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్తుంటారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నారై ఓటర్లుగా 89,839 మంది నమోదు చేసుకున్నారు. కోజికోడ్‌ (సుమారు 36వేలు), మళప్పురం (15వేలు), కన్నూర్‌ (13వేలు)తోపాటు పళక్కడ్‌, వయనాడ్‌, వడకర ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నారు. వీరిని పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు రాజకీయ పార్టీలు విదేశాల్లోనూ ప్రచారం చేశాయి. రాష్ట్రంలో కీలకమైన వటకర స్థానం నుంచి పోటీ చేస్తోన్న యూడీఎఫ్‌ నేత షఫీ పరంబిల్‌, గల్ఫ్‌ దేశాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. స్వదేశానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్‌’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

కేరళలో అన్ని ఎన్నికల సమయాల్లో ‘ఓట్‌ ఫ్లైట్స్‌’ అనేవి సర్వసాధారణం. విదేశాల్లో స్థిరపడినవారిని తీసుకువచ్చేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. గతంతో పోలిస్తే ఈసారి భారీ సంఖ్యలో ఎన్నారైలు వస్తున్నట్లు అంచనా. గత రెండు రోజుల్లో 22వేల మంది స్వస్థలాలకు రాగా.. పోలింగ్‌ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇలా వచ్చేవారి కోసం 12 చార్టర్డ్‌ విమానాలు కూడా అందుబాటులో ఉంచినట్లు సమాచారం. స్వదేశానికి తీసుకువచ్చేందుకుగాను వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న ప్రవాస భారతీయ సంఘాలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ట్రావెల్‌ ఏజెన్సీలతో ముందుగానే సంప్రదింపు జరిపి విమాన టికెట్లలో రాయితీ కల్పించేందుకు కృషి చేస్తాయి. కొందరికి ఉచితంగా ప్రయాణ టికెట్లను సమకూర్చేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే, లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో భాగంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 89 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. ఇందులో కేరళలో మొత్తం 20 స్థానాలకు ఒకే రోజు పోలింగ్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కీలకమైన లోక్‌సభ స్థానాల్లో ఒకటైన వడకరలో యూడీఎఫ్‌ నేత షఫీ పరంబిల్‌, సీపీఎం అభ్యర్థి కేకే శైలజల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img