icon icon icon
icon icon icon

PM Modi: ‘90 సెకన్ల ప్రసంగంతో కాంగ్రెస్‌కు వణుకు’.. ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగం ఆ పార్టీ సహా ఇండియా కూటమిలో ఆందోళన కలిగిస్తోందన్నారు. 

Published : 23 Apr 2024 18:30 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన ‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు భాజపా, కాంగ్రెస్‌ (Congress)ల మధ్య మాటల యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ప్రధాని తాజాగా హస్తం పార్టీపై మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్‌ కుట్ర పన్నుతోందనే సత్యాన్ని తాను బయటపెట్టడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

‘‘ఇటీవల రాజస్థాన్‌ వచ్చినప్పుడు కొన్ని సత్యాలను 90 సెకన్లలో దేశానికి తెలియజేశా. నా ప్రసంగానికి కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రజల ఆస్తులను లాక్కొని వాటిని కొందరు వ్యక్తుల (చొరబాటుదారులను ఉద్దేశిస్తూ)కు పంపిణీ చేసేందుకు కుట్ర పన్నుతోంది. వారి ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలను బయటపెట్టా. అసలు కాంగ్రెస్‌కు ఎందుకు అంత భయం?’’ అని ప్రశ్నించారు. ఒకవేళ 2014 నుంచి కేంద్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉంటే దేశ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించాలన్నారు.

‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!

కాంగ్రెస్‌ ఉంటే దేశం పరిస్థితేంటి..?

‘‘పదేళ్లుగా దేశానికి సేవ చేసేందుకు మీరంతా అనుమతించారు. అప్పటినుంచి ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొంది. అలాకాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించండి. శత్రువులు దేశ సరిహద్దు దాటుకుని వచ్చేవారు. మన జవాన్ల కోసం ‘వన్‌ ర్యాంక్‌.. వన్‌ పెన్షన్‌’ అమల్లోకి వచ్చేది కాదు. మాజీ సైనికులకు రూ.లక్ష కోట్లు అందేవి కావు. 2004లో అధికారంలోకి వచ్చాక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు తగ్గించి వాటిని ముస్లింలకు కేటాయించింది. దీన్ని దేశమంతా అమలుచేసేందుకు ప్రయత్నించేది. 2004- 2010 మధ్య కాలంలో ఏపీలో ముస్లిం రిజర్వేషన్లను అమలుచేసేందుకు యత్నించింది. కానీ, చట్టపరమైన అడ్డంకుల కారణంగా అది సాధ్యం కాలేదు’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img