icon icon icon
icon icon icon

Rahul Gandhi: మోదీ ఆందోళనగా కనిపిస్తున్నారు: రాహుల్ వ్యాఖ్యలు

ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లేలా ప్రధాని మోదీ (Modi) ప్రసంగాలు ఉంటున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. 

Published : 26 Apr 2024 17:17 IST

బిజాపుర్‌: సార్వత్రిక ఎన్నికల వేళ.. భాజపా, కాంగ్రెస్ (BJP-Congress) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ప్రధాని మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు చేశారు. ఈ మధ్య ఆయన ఆందోళనగా కనిపిస్తున్నారని అన్నారు. కర్ణాటకలో బీజాపుర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇటీవల మోదీ ప్రసంగాలు చూస్తుంటే.. ఆయన ఆందోళనగా ఉన్నట్టు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఆయన వేదికపై కన్నీరు పెట్టినా పెట్టొచ్చు. పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ప్రధాన సమస్యల నుంచి ఆయన తన మాటలతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. కొన్నిసార్లు చైనా, పాకిస్థాన్‌ అంటారు. ఇంకొన్నిసార్లు గిన్నెల శబ్దం చేయమంటారు. మీ ఫోన్లలో టార్చ్‌లైట్‌ ఆన్‌ చేయమని చెప్తారు’’ అని దుయ్యబట్టారు. మొదటి దశ పోలింగ్ సరళి చూసిన తర్వాత.. 400 సీట్లు నినాదం నుంచి మోదీ దృష్టి మళ్లిందంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాహుల్ స్పందన వచ్చింది.

మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ

మొదటి దశ పోలింగ్ అనంతరం రెండో విడత కోసం రాజస్థాన్‌లో ప్రచారం చేస్తూ.. మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సంపద అంతా మైనార్టీలకే పంచుతుందన్నారు. ఆ సందర్భంగా చొరబాటుదారులు అనే పదాన్ని ఉపయోగించారు. అలాగే కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వారసత్వ పన్ను వ్యాఖ్యను ఉద్దేశించి.. ‘చనిపోయాక కూడా మిమ్మల్ని కాంగ్రెస్‌ దోచుకుంటుంది’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలపై హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధానికి లేఖ రాశారు. ‘‘మీ ప్రసంగాలకు మీ సొంత వ్యక్తులు కొట్టే చప్పట్లు చూసి, మోసపోకండి. మీ మాటలతో నిరాశకు గురైన కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలను వారు మీ దరి చేరనివ్వడం లేదు’’ అని అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img