icon icon icon
icon icon icon

Inheritance tax: ఇందిరాగాంధీ సంపదను కాపాడుకునేందుకే.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌

తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె సంపద ప్రభుత్వానికి వెళ్లకుండా కాపాడుకునేందుకే.. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ‘వారసత్వ పన్ను’ను రద్దు చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు.

Published : 25 Apr 2024 21:54 IST

భోపాల్‌: కాంగ్రెస్‌ (Congress)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి విరుచుకుపడ్డారు. ‘వారసత్వ పన్ను (Inheritance Tax)’ వ్యవహారంలో తన ఆరోపణలను తీవ్రతరం చేశారు. తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె సంపద ప్రభుత్వానికి వెళ్లకుండా కాపాడుకునేందుకే.. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ‘వారసత్వ పన్ను’ను రద్దు చేశారని ఆరోపించారు. తరాలపాటు దానినుంచి లబ్ధి పొందిన ఆ పార్టీ.. ఇప్పుడు దాన్ని దేశ ప్రజలపై రుద్దాలని చూస్తోందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని మురైనాలో మోదీ ప్రసంగించారు.

‘‘ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వారసత్వ పన్ను ద్వారా ప్రజల సంపాదనలో సగానికిపైగా లాక్కొంటుంది. యువరాజు (రాహుల్‌ గాంధీ) సలహాదారు వారసత్వ పన్ను విధించాలని సూచించారు’’ అని హస్తం పార్టీ సీనియర్ నేత శాం పిట్రోడాపై మోదీ మండిపడ్డారు. ‘‘ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే మీ కష్టార్జితమంతా దోచుకుంటుంది. ప్రజల ఆస్తులు, విలువైన వస్తువులను ‘ఎక్స్-రే’ తీయడం ద్వారా.. నగలు, చిన్న మొత్తం పొదుపులను జప్తు చేయాలని భావిస్తోంది. కానీ, భాజపా ఉన్నంతవరకు దీన్ని అనుమతించదు. మిమ్మల్ని దోచుకోవాలనే కాంగ్రెస్ ప్లాన్‌కు, మీకు మధ్య మోదీ ఒక గోడలా నిలబడతారు’’ అని ఓటర్లనుద్దేశించి వ్యాఖ్యానించారు.

‘వారసత్వ పన్ను’పై రాజకీయ దుమారం

ప్రధాని మోదీ ఆరోపణలను కాంగ్రెస్‌ ఖండించింది. రాజీవ్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను అబద్ధాలుగా పేర్కొంది. ఇదిలాఉండగా.. ప్రజల వద్ద ఉన్న బంగారం సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తుందని, మహిళల మంగళసూత్రాలనూ వదలదంటూ కాంగ్రెస్‌పై ప్రధాని ఇటీవల విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హస్తం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు.. రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారని భాజపా ఆరోపించింది. ఇద్దరిపైనా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ.. కోడ్‌ ఉల్లంఘన కింద ఇరుపార్టీల అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img