icon icon icon
icon icon icon

ఆరు బంతులకు ఆరూ సిక్సర్లే..: భాజపా అభ్యర్థి వ్యాఖ్యలపై అఖిలేశ్‌ రియాక్షన్‌

కన్నౌజ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌ పోటీ చేయడంతో ఇక్కడి పోరు భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లా ఉంటుందంటూ భాజపా అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ స్పందించారు.

Published : 25 Apr 2024 16:36 IST

కన్నౌజ్‌: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌(Akhilesh Yadav) ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌ నుంచి నామినేషన్‌ వేశారు. రామ్‌గోపాల్‌ యాదవ్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలతో కలిసి వెళ్లి ఆయన రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నౌజ్‌ లోక్‌సభ సీటు నుంచి అఖిలేశ్‌ పోటీలో ఉండటంతో ఇక్కడ ఎన్నికలను భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌తో పోల్చుతూ భాజపా అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దీటుగా కౌంటర్‌ ఇచ్చారు. ‘వారు (భాజపా) బంతిని విసరలేరు.. బ్యాట్‌ను సైతం ఉపయోగించలేరు. మేం ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొడతాం’ అన్నారు.

భాజపా నెగెటివ్‌ రాజకీయాలకు తెరపడుతుంది!

‘‘కన్నౌజ్‌ ప్రజలు, పార్టీ కార్యకర్తలు నేను ఇక్కడినుంచి పోటీ చేయాలని కోరుకొంటున్నారు. ప్రజల ఆశీస్సులు లభిస్తాయని ఆశిస్తున్నా. కన్నౌజ్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నా. ఇక్కడినుంచి పోటీ చేయాలని నాన్న (ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్) నన్ను కోరిన తర్వాత నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు.. జనేశ్వర్ మిశ్రా, అమర్ సింగ్, ఆజం ఖాన్, నేతాజీ సహా అగ్రనేతలు ఇక్కడే ఉన్నారు. ఈ ఎన్నికలు భాజపా ప్రతికూల రాజకీయాలకు తెరదించుతాయి. భాజపా ప్రతికూల రాజకీయాలు గానీ, పనితీరు గానీ ప్రజలకు నచ్చదు. ఇక్కడ నేను గెలిచిన తర్వాత కన్నౌజ్‌ నుంచి సోదరభావం, ప్రేమ వ్యాప్తి చెందుతాయి’’ అన్నారు. 

మోదీ, రాహుల్‌ వ్యాఖ్యలు.. కోడ్‌ ఉల్లంఘనపై ఈసీ నోటీసులు

సరైన సమయంలోనే ఇక్కడ ఉన్నా..

ఇక్కడ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై నెలకొన్న జాప్యంపైనా అఖిలేశ్‌ స్పందించారు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టాలన్న పాత సామెతను గుర్తు చేశారు.  తాను సరైన సమయంలోనే ఇక్కడ ఉన్నానన్నారు. కన్నౌజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ప్రారంభించిన పనుల్ని భాజపా ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. ఈసందర్భంగా రామ్‌గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కన్నౌజ్‌లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.  భాజపా అభ్యర్థికి డిపాజిట్‌ కూడా రాకపోవచ్చన్నారు. ఇదిలాఉండగా.. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ అన్నయ్య మనవడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ ఇక్కడినుంచి పోటీ చేస్తారని సమాజ్‌వాదీ పార్టీ తొలుత ప్రకటించినప్పటికీ బుధవారం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. 

1998 నుంచి 2014 వరకు సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉండేది. 2019 ఎన్నికల్లో మాత్రం ఇక్కడ భాజపా నుంచి సుబ్రత్‌ పాఠక్‌ విజయం సాధించారు. 2000, 2004, 2009 ఎన్నికల్లో అఖిలేశ్‌ ఇక్కడినుంచి హ్యాట్రిక్‌ విజయం సాధించగా.. 2012, 2014లో జరిగిన ఈ స్థానంలో జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణి డింపుల్‌ యాదవ్‌ విజయం సాధించారు. 2019లో మాత్రం భాజపా అభ్యర్థి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా     మే 13న నాలుగోవిడతలో కన్నౌజ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img