icon icon icon
icon icon icon

భాజపా నేత ఏకగ్రీవ విజయం వేళ.. కాంగ్రెస్ అభ్యర్థి మిస్సింగ్‌..!

ఓటింగ్ జరగకముందే సూరత్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అనూహ్యంగా ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన జాడలేకుండా పోయారని తెలుస్తోంది. 

Published : 23 Apr 2024 13:48 IST

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌ (Surat) స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ (Mukesh Dalal) ఏకగ్రీవంగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత నీలేశ్‌ కుంభానీ (Nilesh Kumbhani) ‘మిస్‌’ అయ్యారు. ఫోన్‌లో కూడా ఆయన అందుబాటులో లేరని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

కుంభానీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఆయన నామినేషన్‌ను ఆదివారం రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ నుంచి వేసిన మరో నామినేషన్‌ కూడా చెల్లనిదిగా ప్రకటించారు. మరోవైపు, ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన సోమవారం వీరంతా పోటీ నుంచి వైదొలిగారు. దాంతో లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు తొలి విజయం దక్కినట్లయింది. ఇక అప్పటి నుంచి కుంభానీ కనిపించట్లేదు. ఆయన ఇంటికి తాళం వేసి ఉంది. ఆయన త్వరలో భాజపాలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఊహాగానాలతో హస్తం పార్టీ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్రోహి అని పోస్టర్లు ప్రదర్శిస్తూ, ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు.

సూరత్‌లో భాజపా అభ్యర్థి ఏకగ్రీవం

మొత్తంగా ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియపై గుజరాత్‌లో అధికారంలో ఉన్న భాజపా అనుచిత ప్రభావం చూపిందని కాంగ్రెస్ ఆరోపించింది. సూరత్‌లో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఇదిలా ఉంటే.. ముకేశ్‌ నెగ్గినట్లు జిల్లా ఎన్నికల అధికారి ధ్రువీకరణపత్రం ఇచ్చారు. ప్రధాని మోదీ చేతికి మొదటి ‘విజయ కమలా’న్ని అందించారంటూ గుజరాత్‌ భాజపా అధ్యక్షుడు సి.ఆర్‌.పాటిల్‌ తమ అభ్యర్థిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img