icon icon icon
icon icon icon

LS Polls: ‘మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!’ అమేఠీ, రాయ్‌బరేలీ అభ్యర్థిత్వాలపై ఖర్గే

రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ స్థానాలకు నేడు అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. దీనికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

Published : 27 Apr 2024 15:28 IST

గువాహటి: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ (Congress) కంచుకోటలుగా పేరొందిన రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. శనివారం పోటీదారుల పేర్లు ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. దీనికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలిపారు. అస్సాంలోని గువాహటిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఖర్గే.. అవినీతి పరులను జైళ్లలో పెట్టాలని భాజపా (BJP) చెబుతున్నప్పటికీ.. అటువంటి నేతలు పార్టీలో చేరినప్పుడు మాత్రం వారిని ఒడిలో కూర్చుబెట్టుకుని రాజ్యసభకు, అసెంబ్లీకి పంపుతోందని విమర్శించారు.

రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాల అభ్యర్థుల విషయంలో అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ.. ‘‘ఇందుకోసం మీరు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థుల పేర్లు నా వద్దకు వచ్చి, నేను సంబంధిత నోటిఫికేషన్‌పై సంతకం చేశాక ప్రకటిస్తాం’’ అని బదులిచ్చారు. అమేఠీకి బదులుగా కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండటాన్ని భాజపా విమర్శించడంపై స్పందిస్తూ.. ‘‘నియోజకవర్గాలను మార్చడంపై మా పార్టీని ప్రశ్నిస్తున్న వారు.. అటల్ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే ఆడ్వాణీలు ఎన్నిసార్లు సీట్లు మార్చుకున్నారో కూడా చెప్పాలి’’ అని కమలదళం నేతలను ప్రశ్నించారు.

‘నాకోసం దేశం ఎదురుచూస్తోంది’: అమేఠీలో పోటీపై రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు

కాంగ్రెస్‌తోనే ఎదిగి.. ఆ తర్వాత దానిని వీడిన వ్యక్తుల వల్ల పార్టీ ప్రభావితం కాదంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై ఖర్గే విమర్శలు చేశారు. తమ పార్టీ ప్రవహించే నది లాంటిదని, కొంతమంది వీడినా ఎటువంటి ప్రభావం ఉండబోదన్నారు. అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు ఐదోవిడతలో భాగంగా మే 20న పోలింగ్‌ నిర్వహించనున్నారు. 2004 నుంచి అమేఠీకి ప్రాతినిధ్యం వహించిన రాహుల్‌.. 2019 ఎన్నికల్లో స్మృతిఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి రాహుల్‌ ఇక్కడ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సిఉంది. సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకగాంధీని బరిలోకి దింపేందుకు హస్తం పార్టీ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img