icon icon icon
icon icon icon

Lok Sabha polls: రండి.. ఓటేయడం మరిచిపోవద్దు: బస్సులు, దుకాణాల్లో ఓ కలెక్టరమ్మ విజ్ఞప్తి

ఓటు విలువను వివరిస్తూ.. ఎన్నికల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయడమే లక్ష్యంగా కొట్టాయం కలెక్టర్‌ విఘ్నేశ్వరి వినూత్నంగా ప్రయత్నించారు.

Updated : 26 Apr 2024 09:22 IST

కొట్టాయం: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ ఓటర్లలో చైతన్యం నింపేందుకు ఓ కలెక్టరమ్మ విలక్షణమైన మిషన్‌ చేపట్టారు. సార్వత్రిక సమరంలో రెండో దశలో భాగంగా కేరళలో ఎన్నికలు జరగనుండటంతో పోలింగ్‌ శాతం పెంచేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించేలా వినూత్న ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టిసారించిన కొట్టాయం జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారిణి వి.విఘ్నేశ్వరి గురువారం బస్సుల్లో, దుకాణాల వద్ద ప్రజలను కలిసి ఓట్ల పండుగలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇందులోభాగంగా గురువారం నాగపాదంలోని ఓ ప్రైవేటు బస్‌స్టాండ్‌లో బస్సుల్లోకి వెళ్లిన కలెక్టర్‌ అక్కడి ప్రయాణికులతో మాట్లాడారు. ‘‘రేపే పోలింగ్‌.. మరిచిపోవద్దు. రండి.. మీ ఓటు హక్కు వినియోగించుకోండి’’ అని కోరారు.  2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి అయిన విఘ్నేశ్వరి బస్సులోకి రావడంతో ప్రయాణికులు గౌరవసూచికంగా తమ సీటులోంచి నిలబడి ఆమె చెప్పిన విషయాలపై సానుకూలంగా స్పందించారు. అక్కడున్న పిల్లలతో ఆమె మట్లాడుతూ.. ‘పిల్లలూ.. మీ తల్లిదండ్రులను ఓటు వేయమని చెప్పండి’ అంటూ వారికి క్యాండీతో పాటు ఓటు విలువను సూచించేలా ఉన్న ఓ లెటర్‌ను అందించారు. అనంతరం బస్టాండ్‌లోని దుకాణాల వద్దకు వెళ్లి అక్కడ ఉన్నవారితో మాట్లాడారు. అక్కడే బస్సు కోసం వేచిచూస్తున్న ఓ విద్యార్థినితో ‘ఓటేసే వయస్సు వచ్చిందా? అని కలెక్టర్‌ అడిగారు. అవునంటూ సదరు విద్యార్థిని సమాధానం చెప్పడంతో ‘దయచేసి ఓటు వేయడం మరిచిపోవద్దు. మన ప్రజాస్వామ్యానికి మీరే వెన్నెముక. మీరు తొలిసారి ఓటర్లే కావొచ్చు.. దయచేసి రేపు వెళ్లి ఓటు వేయండి’’ అని సూచించారు.

ప్రపంచంలోనే ‘కాస్ట్‌లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?

అనంతరం కలెక్టర్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ప్రజాస్వామిక పండుగలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అందరం ఓటు వేయాలని, మనకు ఉన్న సమయంలో ఒక గంట సమయాన్ని వెచ్చిద్దాం అని కోరారు. ఓట్లు అన్నీ ఎంతో విలువైనవని.. అందుకే ఓట్ల విలువను ప్రజలను వ్యక్తిగతంగా కలిసి వారికి తెలియజేస్తున్నట్లు చెప్పారు. కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 26న పోలింగ్ జరగనుంది. 20 స్థానాల్లో 194మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌, భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమిలు పోటీ పడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img