జిలేబీ.. జామూన్‌.. సమోసా : మనవి కావా?

పప్పు అన్నానికి మించిన చక్కటి భోజనం మరెక్కడ ఉంటుంది చెప్పండి. వేడి వేడి అన్నంలో పప్పు.. ఆవకాయ వేసుకొని తింటే అద్భుతహాః అంటూ లొట్టలేసుకుంటే తినాల్సిందే. మన తెలుగురాష్ట్రాలు సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా తినే ఈ పప్పు అన్నం నిజానికి మన వంటకం కాదంటే

Updated : 27 Oct 2020 13:48 IST

పప్పు అన్నానికి మించిన చక్కటి భోజనం మరెక్కడ ఉంటుంది చెప్పండి. వేడి వేడి అన్నంలో పప్పు.. ఆవకాయ వేసుకొని తింటే అద్భుతహాః. లొట్టలేయాల్సిందే. మన తెలుగురాష్ట్రాలు సహా దక్షిణాదిలో ఎక్కువగా తినే ఈ పప్పన్నం నిజానికి మన వంటకం కాదంటే నమ్ముతారా?? ఇదే కాదు.. మన భారతీయులు అత్యంత ఇష్టంగా తినే సమోసా, గులాబ్‌జామూన్‌, జిలేబీ, రాజ్మా కూర కూడా మన దేశానికి చెందినవి కావు. మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయి..? భారతీయుల వంటకాల్లో ఎలా భాగమయ్యాయో మీరే చదవండి..

పప్పు

తెలుగురాష్ట్రాల్లో పప్పు వండని ఇల్లు ఉండదు. పప్పును సులువుగా వండొచ్చు.. రుచిగానూ ఉంటుంది. అనుకోకుండా చుట్టాలొస్తే.. వెంటనే పప్పు అన్నం వండి పెట్టేస్తాం. వివాహాది శుభకార్యాలు జరిగినా ఈ వంటకం తప్పకుండా ఉండాల్సిందే. అందుకే పెళ్లి కావాల్సిన పిల్లలను బంధువులు ‘పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తున్నావ్‌’ అని అడుగుతుంటారు. అంతలా మన వంటకంలో భాగమైన పప్పు భోజనం మన వంటకం కాదు. ఇది నేపాల్‌ సంప్రదాయ వంటకం. ‘దాల్‌ భట్‌’గా పిలిచే ఈ వంటకాన్ని నేపాల్‌ ప్రజలు ప్రతి రోజూ వండుకుంటారు. ఉడికించిన అన్నం, పప్పు.. పచ్చళ్లు కలుపుకొని తింటారు. ఈ వంటకమే నేపాల్‌ నుంచి ఉత్తర భారతానికి విస్తరించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపించింది. అలా దక్షిణాది ప్రజలకు ప్రియమైన భోజనంగా మారిపోయింది.


గులాబ్‌ జామూన్‌

కుటుంబసభ్యుల పుట్టిన రోజు లేదా చిన్న చిన్న వేడుకలు జరిగినప్పుడు కచ్చితంగా చేసే తీపి పదార్థం గులాబ్‌జామూన్‌. కోవా లేదా గులాబ్‌ జామూన్‌ పౌడర్‌ను గుండ్రటి ముద్దలుగా చేసి నూనెలో వేయించి.. ఆ తర్వాత చక్కెర పాకంలో నానపెడతారు. మధురమైన రుచి ఉండే ఈ గులాబ్‌జామూన్లను పర్షియన్లు భారత్‌కు పరిచయం చేశారు. పర్షియన్‌ భాషలో ‘గొల్‌’ అంటే పువ్వు.. ‘అబ్‌’ అంటే నీరు. కోవాతో చేసిన గుండ్రటి ముద్దలను గులాబీ వాసన వచ్చే తీయని పానీయంలో ముంచుతారు. అందుకే వాటిని ‘గొలాబ్‌ జామూన్‌’ అనే వారు. మొదట్లో వీటిని తేనెలో నానబెట్టి పైన చక్కెర జల్లే వారు. అప్పుడు వీటికి ‘ఇక్మత్‌ అల్‌ ఖాదీ’ అనే పేరుండేది. ప్రస్తుతం ఆ తీపి పదార్థమే ‘గులాబ్‌ జామూన్‌’గా ప్రాచుర్యం పొందింది. 


జిలేబీ

ఇది కూడా చక్కెర పాకంలో నానబెట్టిన తీపి పదార్థమే. ఇంట్లో చేసుకోవడం తక్కువే గానీ, ప్రతి మిఠాయి దుకాణంలో ఇవి అందుబాటులో ఉంటాయి. అరబిక్‌లో దీనిని ‘జలబియా’, పర్షియన్‌లో ‘జిలేబియా’అని పిలుస్తారు. పర్షియాకు చెందిన వర్తకులు జిలేబీలను భారత్‌లోకి తీసుకొచ్చారు. ఉత్తరభారతంలో ఈ జిలేబీలను కరకరలాడేలా చేస్తుంటారు.. దక్షిణాదిలో ఇవి మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు.  


సమోసా

సాయంత్రంపూట అల్పాహారంగా, చాయ్‌కి జోడీగా భారతదేశమంతా పాపులరైన సమోసా.. ఇప్పటిది కాదు, 10వ శతాబ్దానికి ముందు నుంచే మధ్యప్రాచ్య దేశాల ప్రజలు వీటిని తినడం మొదలుపెట్టారు. దీని అసలు పేరు ‘సంబోసా’. 14వ శతాబ్దంలో మధ్య ఆసియా వర్తకులు భారతదేశానికి పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ సమోసా అనేక రుచులతో ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా సమోసాలో ఆలూ కుర్మా ఉంటుంది. కానీ, కొన్ని ప్రాంతాల్లో ఆలూ కుర్మాకు బదులు ఉల్లిపాయలు, మొక్కజొన్న.. చికెన్‌, మటన్‌, చేప కూరలు పెట్టి మరీ సమోసాలను తయారు చేస్తున్నారు. 


రాజ్మా

ఉత్తరభారతంలో అత్యధికంగా ప్రజలు వండుకునే వంటకం రాజ్మా. కిడ్నీ ఆకారంలో ఉండే పప్పు దినుసులతో చేసే ఈ వంటకం లేకుండా అక్కడి వారు భోజనం చేయరు. అయితే ఈ కిడ్నీ ఆకారపు పప్పు దినుసులు పోర్చుగల్‌ నుంచి భారత్‌కు రాగా.. వంట చేసే విధానం మెక్సికో నుంచి నేర్చుకున్నాం. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని