నియంత రాసిన రొమాంటిక్‌ నవల

సద్దాం హుస్సేన్‌.. 1979 నుంచి 2003 వరకు ఇరాక్‌ను ఏకధాటిగా పాలించిన నియంత. దేశాధ్యక్షుడిగా ఇరాక్‌కు ఎన్నో సేవలు చేసిన సద్దాం.. ఆ పదవిని కాపాడుకోవడం కోసం...........

Published : 07 Sep 2020 09:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సద్దాం హుస్సేన్‌.. 1979 నుంచి 2003 వరకు ఇరాక్‌ను ఏకధాటిగా పాలించిన నియంత. దేశాధ్యక్షుడిగా ఇరాక్‌కు ఎన్నో సేవలు చేసిన సద్దాం.. ఆ పదవిని కాపాడుకోవడం కోసం, ప్రపంచ దేశాల ముందు తన సత్తా చాటుకోవడం కోసం క్రూరుడిగా మారిపోయాడు. తన దేశానికే తానో రాజుగా భావించేవాడు. ఈ క్రమంలోనే తనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వారిని అణచివేసేవాడు. ఇరాన్‌తో తన పదవికి గండం ఉందని ఆ దేశంతో యుద్ధానికి దిగి, ఆధిపత్యపోరులో అమెరికాతో వైరం పెట్టుకుని తన పతనానికి తానే కారణమయ్యాడు. అమెరికా చర్యలతో పదవి కోల్పోయిన సద్దాం.. అగ్రరాజ్య సేనలకు చిక్కి 2006 డిసెంబర్‌ 30న ఉరికంభం ఎక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఇంతటి క్రూరస్వభావం ఉన్న సద్దాం హుస్సేన్‌‌లో రొమాంటిక్‌ కోణం కూడా ఉంది. తన జీవిత కాలంలో సద్దాం అనేక నవలు రాశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ తెచ్చుకుంది మాత్రం రొమాంటిక్‌ నవల ‘జబీబా అండ్‌ ది కింగ్‌’. ఇరాక్‌ చరిత్రను, దేశంలో జరిగిన సంఘటనలకు ప్రతీకగా ఈ నవలను రచించడం గమనార్హం.

‘జబీబా అండ్‌ ది కింగ్‌’ నవల ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌కి 140 కి.మీ దూరంలో ఉన్న టిక్రిట్‌ పట్టణం (సద్దాం స్వస్థలం) నేపథ్యంలో 7-8 శతాబ్ద కాలంలో జరిగినట్లుగా ఉంటుంది. ఇదో ప్రేమకథ. ఈ నవలలోని ముఖ్యపాత్ర జబీబా అనే అమ్మాయికి వివాహమవుతుంది. అయితే ఆమె భర్త క్రూరుడు. భార్యను చిత్రహింసలు పెడుతూ.. బలవంతం చేస్తూ అత్యాచారానికి పాల్పడుతుంటాడు. అదే సమయంలో ఇరాక్‌ రాజు ఆమెను గాఢంగా ప్రేమిస్తాడు. రొమాంటిక్‌గా సాగే ఈ నవలలో చివరికి జబీబాను హింసించిన వారిపై చక్రవర్తి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈ క్రమంలో అతడు కూడా మరణిస్తాడు. 2000 సంవత్సరంలో సద్దాం ఈ నవలను రాశాడు. అయితే ఈ నవలను అప్పటి పరిస్థితులను అద్దం పట్టేలా మలచడం విశేషం. జబీబా అనే పాత్రను ఇరాక్‌ ప్రజలుగా, క్రూరమైన భర్తగా అమెరికాను అభివర్ణించాడు. తనను ఇరాక్‌ రాజుగా చెప్పుకున్నాడు. నవలలో జబీబాపై ఆమె భర్త అఘాయిత్యాన్ని.. 1991 జనవరి 17న ఇరాక్‌పై అమెరికా సైన్యం దాడి చేయడంతో పోల్చాడు. ఆమెపై అఘాయిత్యం జరిగే తేదీని కూడా సద్దాం జనవరి 17గా పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ఈ నవలను సద్దాం అరబిక్‌లో రాయగా.. 2004లో ఆంగ్లంలోకి తర్జుమా చేసి ప్రచురించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని