139 ఏళ్ల ఈ ఇంటి ‘అడ్రస్‌ మారింది’!   

కొత్త ఇంటికి వెళ్లినప్పుడు.. ఇంటి ఎడ్రస్‌ మారింది అంటాం. మరి ఇంటి ఎడ్రస్సే అచ్చంగా మారితే..!

Updated : 23 Feb 2021 17:21 IST

శాన్‌ ఫ్రాన్సిస్కో: ఇల్లు మారి కొత్త ఇంటికి వెళ్లినప్పుడు.. ఇంటి అడ్రస్‌ మారింది అంటాం. మరి ఇంటి అడ్రస్సే అచ్చంగా మారితే..! నిజంగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సదరు పురాతన విక్టోరియన్‌ భవంతిని 139 ఏళ్ల క్రితం నిర్మించిన నాటి నుంచి ‘807, ఫ్రాంక్లిన్‌ స్ట్రీట్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో’ అనే చోటే ఉంది. కాగా, కొన్ని కారణాల వల్ల ఈ ఆదివారం అదే ప్రాంతంలో ఆరు వీధుల అవతల ఉన్న ఫుల్‌ట్రాన్‌ స్ట్రీట్‌కు చేరుకుని తన చిరునామా మార్చుకుంది. ఆరు బెడ్రూములు, పెద్ద పెద్ద కిటీకీలు, చక్కటి ముఖ ద్వారం ఉన్న రెండంతస్తుల ఈ అందమైన ఇంటిని తరలించేందుకు దాని యజమాని టిమ్‌ బ్రౌన్‌ నాలుగు లక్షల డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు మూడు కోట్ల రూపాయిలు) చెల్లించాడట.

అంత ఈజీ కాదు..

ఐతే ఈ ఇంటిని తరలించటం అంత సులువుగా సాధ్యం కాలేదని.. ఇళ్లను తరలించడంలో అమిత అనుభవం ఉన్న ఫిల్‌ రాయ్‌ తెలిపారు. ఇందుకు వారు ఏళ్ల తరబడి ప్రణాళిక రచించారట. పదిహేను ప్రభుత్వ, నగర పాలక సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాల్సి వచ్చిందట. పార్కింగ్‌ స్థలాలు, చెట్ల కొమ్మలు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు వంటి ఆటంకాలన్నీ తాత్కాలికంగా తొలగించారట. ట్రాలీపై అత్యధికంగా గంటకు ఒక మైలు వేగంతో ప్రయాణించారట. కాగా, మార్గమధ్యంలో కాస్త పల్లంగా ఉన్న చోట కాస్త టెన్షన్‌ పడ్డామని ఫిల్‌ తెలిపారు. అదృష్టవశాత్తూ ఏ ఆటంకం లేకుండానే ఈ కార్యక్రమం సజావుగా పూర్తైందని ఆయన వివరించాడు.

భారీ ట్రాలీపై తరలి వెళ్లున్న ఆ ఇంటిని చూసేందుకు అక్కడి ప్రజలు క్యూ కట్టారు. ‘అడ్రస్‌ మారుతున్న ఇంటి’తో సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. మరి ఇల్లే  మారిన విచిత్రాన్ని మీరూ చూడండి!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని