వ్యాధుల భయం వెంటాడుతోందా?

ఓ వైపు దేశంలో కరోనా అలజడి కొనసాగుతోంది. మరోవైపు శీతాకాలం పొదుగట్టున కూర్చొని ఉంది. చలికాలంలో కరోనా వేగంగా వ్యాపించే అవకాశముందని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆరోగ్య నిపుణులు నోరుకట్టుకొని మరీ చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తినాలని సూచిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ శరీరంలో...

Published : 31 Oct 2020 10:03 IST

వ్యాధి నిరోధక శక్తిని పెంచే పళ్లు ఇవే

ఓ వైపు దేశంలో కరోనా అలజడి కొనసాగుతోంది. మరోవైపు శీతాకాలం సమీపిస్తుండటంతో కరోనా వేగంగా వ్యాపించే అవకాశముందని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తినాలని సూచిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందకపోతే ఫలితం శూన్యం. అందువల్ల వ్యాధుల బారి నుంచి రక్షించుకోవడానికి వీలుగా కొన్ని రకాల సీజనల్‌ ఫ్రూట్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూసేద్దామా?

1. జామ
కాస్త వగరుగా.. ఇంకాస్త తియ్యగా ఉండే దోర జామకాయలంటే ఇష్టపడని వారెవరు చెప్పండి. వీటిలో విటమిన్‌-సి ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీర కణాలు నశించిపోకుండా ఇవి రక్షిస్తాయి. ఇతర నిమ్మజాతి పళ్లలో కన్నా ఇందులో సి -విటమిన్‌ నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువ. హృద్రోగాలతోపాటు అనేక రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. ఇందులోని పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కాల్షియం, ఐరన్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి. సోడియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు వ్యర్థాలను తొలగించడంలో మూత్రపిండాలకు సాయపడతాయి. దంత పరిరక్షణకూ జామ దివ్యౌషధం. దృష్టిలోపం ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది

2. దానిమ్మ

రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయుల్ని పెంచడానికి దానిమ్మ సహకరిస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.దానిమ్మలో విటమిన్‌-ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులోని జింక్‌ లవణం కణాల వృద్ధికి సహకరిస్తుంది. అంతేకాకుండా గాయాలు మానడానికి తోడ్పడుతుంది. దానిమ్మలో మెలనిన్‌ వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది కళ్లు, చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.

3.బేరిపండు (పియర్స్‌)
లేత ఆకుపచ్చ రంగులో ఇది చూడచక్కగా ఉంటుంది. పోషకాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. వీటిని నేరుగా లేదా జ్యూస్‌ చేసుకొని తీసుకోవచ్చు. ఈ పళ్లలో విటమిన్‌ సి, విటమిన్‌ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను సరఫరా చేయడం ద్వారా, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. పియర్స్‌ పళ్లు ఎక్కువ ఫైబర్‌ను కలిగి ఉండటం వల్ల శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడంలో సహకరిస్తాయి. మలబద్ధకం, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్‌ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో మేలు చేస్తాయి. మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను కరిగిస్తాయి. పియర్స్‌లో కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, బీ కాంప్లెక్స్ విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి.

4.నారింజ
దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ ఇది అందుబాటు ధరలో ఉంటుంది. ఆరెంజ్‌లో విటమిన్‌ సి, కాల్షియం విరివిగా ఉంటాయి. వివిధ రకాల సీజనల్‌ వ్యాధులతోపాటు దీర్ఘకాలిక రోగాలను సైతం ఎదుర్కొనేలా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో దీనికి మించిన పండు మరొకటి లేదు. రోజుకు ఒక పండు తింటే ఆ రోజులో కావలసిన ‘సి’ విటమిన్‌ మొత్తం లభిస్తుందట. వీలైనంత వరకు జ్యూస్‌ రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నారింజ వల్ల కఫం, వాతం, జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. జీవక్రియల్లో కీలకపాత్ర పోషించే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, రాగి ఇందులో లభిస్తాయి.

5.ఆపిల్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఒక్క ఆపిల్‌ అయినా తినాలని చాలా మంది చెబుతుండటం వినే ఉంటాం. ఇది ముమ్మాటికీ నిజం. యాపిల్‌లో పోషకాలు చాలా ఎక్కువ. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. పీచుపదార్థం, విటమిన్‌ సి, విటమిన్‌ కె ఎక్కువగా ఉంటాయి. చాలా మంది పోషకాహార నిపుణులు ఎక్కువగా యాపిల్‌ వాడమనే చెబుతుంటారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

6. బత్తాయి
ఇది నిమ్మ జాతికి చెందిన పండు. విటమిన్‌ సి ఎక్కువ. చాలా మంది దీనిని నేరుగా కాకుండా జ్యూస్‌ రూపంలో తీసుకోవడానికే ఇష్టపడతారు.అయితే మన శరీరానికి అవసరమైన ఫైబర్‌ కావాలంటే దీనిలోని పీచుపదార్థాన్ని బయటకు తీసేయకుండా తినాలి. ఇలా చేయడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనిలోని విటమిన్‌-సి చర్మంపై వచ్చే మొటిమలు, నల్లని మచ్చలను నయం చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఏమైనా మలినాలు ఉంటే బయటకు పంపించి వేస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

7 ఆల్‌ బుకారా
ఇది మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చూడటానికి ఎర్రగా యాపిల్‌లా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పళ్లు తింటే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరుగుతాయని చాలా మంది భావన, అయితే దీనివల్ల ఎలాంటి నష్టం జరగదని వైద్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్‌ సి ఎక్కువగా ఉన్నందువల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పూర్తిగా తగ్గిపోతుంది. మనం తినే ఆహారం నుంచి శరీరం ఐరన్‌ను గ్రహించేలా ఈ పండు సహకరిస్తుంది. వాత నొప్పులు ఏమైనా ఉంటే ఈ పళ్లు తినడం వల్ల నయమవుతాయి. శరీర కణాలు దెబ్బతినకుండా ఆల్‌ బుకారా రక్షిస్తుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహకరిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని