‘పెళ్లికి గిఫ్టులొద్దు.. రైతులకు దానం చేయండి’

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు కొనసాగిస్తున్న నిరసనలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తిండీతిప్పలు లేకుండా వారు కొనసాగిస్తున్న ఆందోళనలకు...

Updated : 11 Dec 2020 13:52 IST

చండీగఢ్‌: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు కొనసాగిస్తున్న నిరసనలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తిండీతిప్పలు లేకుండా వారు కొనసాగిస్తున్న ఆందోళనలకు అనేకమంది అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ఓ కుటుంబం తమ దాతృత్వాన్ని చాటుకుంది. తమ కుమారుడి వివాహానికి హాజరయ్యేవారు ఎలాంటి బహుమతులు తీసుకురావద్దని బంధువులు, మిత్రులకు తెలియజేశారు. బహుమతులకు బదులుగా రైతులకు చేయూతనందించాలని కోరారు. అందుకు వివాహ వేడుకలో ఓ హుండీని ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరైనవారు తమకు తోచినంత ఆ హుండీలో వేస్తే పోగైన డబ్బును నిరసనలో పాల్గొంటున్న రైతులకు అందజేయనున్నట్లు ఆ కుటుంబం వెల్లడించింది. ‘ఇది మనందరి పోరాటం. ప్రతిఒక్కరు రైతులకు చేయూతనందించాలి. రైతులకు అండగా నిలవాలని యువతను కోరుతున్నా’ అని వరుడు అభిజిత్‌సింగ్‌ పేర్కొన్నాడు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలు నేటితో 16వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వానికి, రైతుల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా సఫలం కాలేదు. చట్టాలు రద్దు చేయలేమని, కావాలంటే కొన్ని సవరణలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. సవరణలతో మా సమస్యలు తీరవని, నూతన చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. చట్టాలను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని రైతు సంఘాలు గతంలోనే నిర్ణయించాయి. 

ఇవీ చదవండి...

పీటముడి వీడేదెలా?

రైతుల ఆందోళనపై పొరబడిన యూకే ప్రధాని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని