కొవిడ్‌కు డెంగీ తోడైతే బెంగే 

ఒకపక్క కొవిడ్‌ ముప్పు తొలగకముందే.. మరోవైపు సీజనల్‌ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. ఇప్పటికీ రోజుకు 1400-1500 కరోనా కేసులు రాష్ట్రంలో

Published : 02 Nov 2020 15:56 IST

ఏకకాలంలో రెండింటికీ చికిత్స సవాలే
వీటికి చికిత్సపై కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల విడుదల 

ఈనాడు- హైదరాబాద్‌: ఒకపక్క కొవిడ్‌ ముప్పు తొలగకముందే.. మరోవైపు సీజనల్‌ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. ఇప్పటికీ రోజుకు 1400-1500 కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవుతుండగా.. గత రెండు నెలల్లోనే సుమారు 550 డెంగీ కేసులు కొత్తగా నిర్ధారణ కావడం ఆందోళన కలుగజేస్తోంది. గతేడాది సెప్టెంబరు తర్వాతే అత్యధికంగా డెంగీ కేసులు నమోదై.. ఆ ఏడాది మొత్తం 13 వేలకు పైగా నిర్ధారణ అయ్యాయి. దేశంలో 2019లో అత్యధికంగా 1,57,315 కేసులు నమోదవ్వగా.. ఈ ఏడాదిలో అక్టోబరు 18 నాటికి 20,202 కేసులు, 12 మరణాలు సంభవించాయి. ఒకే వ్యక్తికి కరోనా, డెంగీ జ్వరాలు ఒకేసారి సోకితే ఏకకాలంలో చికిత్స అందించడం వైద్యనిపుణులకే సవాల్‌ అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే అసోం, చండీగఢ్, దమణ్‌ దీవ్, దిల్లీ, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో.. కొవిడ్, డెంగీ రెండూ సోకిన కేసులు నమోదయ్యాయి. కొన్నిచోట్ల మరణాలూ సంభవించాయి. ఈ నేపథ్యంలో ఏకకాలంలో రెండు వైరస్‌ల బారినపడిన బాధితులకు చికిత్స అందించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది. 

ఎందుకు సవాల్‌ 

ఒకే వ్యక్తికి ఏకకాలంలో రెండు వైరస్‌లూ సోకితే.. చికిత్స అందించడం సవాలేనని నిపుణులు చెబుతున్నారు. జ్వరాల్లో లక్షణాలు దగ్గరగా ఉండడం వల్ల జబ్బును గుర్తించడంలో పొరబడే అవకాశాలు ఎక్కువ. రెండింటిలోనూ సమస్య తీవ్రమైతే ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స అందించాల్సిన అత్యవసర పరిస్థితులు ఎదురవుతుంటాయి. రెండింటికీ మందులు లేవు. టీకాల కోసం ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 

లక్షణాలను బట్టి చికిత్స 

జ్వర లక్షణాలు కనిపించగానే.. కొవిడ్, డెంగీ పరీక్షలు చేయించాలి. ఒకే వ్యక్తికి రెండూ సోకినప్పుడు.. దేని ప్రభావం ఎక్కువగా ఉంటే.. ఆ మేరకు చికిత్స అందించాలి. ముందుగా కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌(సీబీపీ) పరీక్షను చేయించాలి. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితుల్లో.. ‘ప్యాకెడ్‌ సెల్‌ వాల్యూమ్‌(పీసీవీ)’ ఎక్కువగా ఉంటే.. శరీరం ఎత్తు, బరువు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఐవీ ద్రావణాలను అందించాలి. సాధారణంగా డెంగీ రోగుల్లో ప్లేట్‌లెట్లు 10 వేలకంటే తగ్గితే.. వాటిని ఎక్కించాలి. ఒకవేళ ప్లేట్‌లెట్లు 20 వేలు ఉన్నా రక్తస్రావం అవుతున్నపుడు ఎక్కించడం తప్పనిసరి. డెంగీ కంటే కొవిడ్‌ ప్రభావం మధ్యస్థంగా, ఎక్కువగా ఉన్న రోగుల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు హెపరిన్‌ ఔషధం ఇవ్వాలి. వీరికి ప్లేట్లెట్లు, డీ-డైమర్‌ పరీక్ష చేయిస్తుండాలి. ఒకవేళ వీరిలో ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉన్నా.. రక్తస్రావం అవుతున్నా ఈ ఔషధాన్ని ఇవ్వకూడదు. కరోనా రోగులకు స్టెరాయిడ్‌ ఔషధం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే డెంగీ సోకిన వారికి అయిదారు రోజుల తర్వాత మాత్రమే స్టెరాయిడ్‌ ఇవ్వవచ్చు. 

-డాక్టర్‌ ఎంవీ రావు, ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని