ఆధునిక వ్యవసాయ పద్ధతుల ‘చైతన్య’ం...

జీవితంలో అలా స్థిరపడాలి... ఇలా స్థిరపడాలి అని చాలామంది రకరకాల కలలు కంటుంటారు. వాటిని నెరవేర్చుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే అన్ని సందర్భాల్లోనూ ఆ కలలు నెరవేరకపోవచ్చు.

Published : 07 Dec 2020 23:19 IST

 


ఇంటర్నెట్‌ డెస్క్‌ :  జీవితంలో అలా స్థిరపడాలి... ఇలా స్థిరపడాలి అని చాలామంది రకరకాల కలలు కంటుంటారు. వాటిని నెరవేర్చుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే అన్ని సందర్భాల్లోనూ ఆ కలలు నెరవేరకపోవచ్చు. అయితేనేం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపేందుకు కృషి చేస్తున్నప్పుడు కలిగే సంతృప్తే వేరు. ఆ యువకుడి పరిస్థితి కూడా అలాంటిదే మరి. వైద్యుడిగా స్థిరపడాలనుకున్నా.. ఊహించని విధంగా వ్యవసాయ విద్యలోకి అడుగుపెట్టాడు. అహర్నిశలు శ్రమించే అన్నదాతలకు ఆధునిక పద్ధతులను చేరువ చేస్తూ అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. అపార అనుభవం గల వ్యవసాయ నిపుణులతో కలిసి వేదిక పంచుకుంటున్నాడు. రైతు సంక్షేమమే లక్ష్యంగా విస్తృత అధ్యయనాలతో ఆకట్టుకుంటున్నాడు. అతడే లవ్‌లీ ప్రొఫెషనల్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న కృష్ణ చైతన్య.

అతడిది విజయనగరం జిల్లా. అతడు చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుకుగా ఉండేవాడు. వైద్యుడిగా స్థిరపడాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. అనుకోని పరిస్థితిలో ఎంబీబీఎస్‌లో సీటు రాలేదు. దాంతో అగ్రికల్చర్‌ బీఎస్సీలో చేరాడు. డిగ్రీ తరువాత విదేశాల్లో ఎమ్మెస్సీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. అయితే పరిస్థితులు అనుకూలించక పోవటంతో ప్రస్తుతం లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. 

ఎం.ఎస్‌ స్వామినాథన్‌ స్ఫూర్తితో వ్యవసాయంలో విస్తృత పరిశోధనలు చేయటంపై దృష్టిసారించాడు కృష్ణచైతన్య. ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటే వ్యవసాయం కన్నా లాభసాటి రంగం మరొకటి లేదంటున్నాడు. విద్యార్థి దశలో అంతర్జాతీయ స్థాయి నిపుణులతో తన ఆలోచనలు పంచుకుంటున్నాడు. దేశవిదేశాల్లో అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందరికీ  పరిచయం చేయాలి, ఫలితంగా ఈ రంగాన్ని లాభసాటిగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడతడు. డిగ్రీ స్థాయి నుంచే వ్యవసాయంపై తనకున్న మక్కువను ఏదో విధంగా పంచుకునేవాడు. అగ్రిమీట్‌, అగ్రిపుడ్‌ ఈ న్యూస్ వంటి జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ వార, మాస పత్రికల్లో అతని వ్యాసాలు ప్రచురితమయ్యాయి. సాధారణంగా వీటిలో అత్యంత అనుభవజ్ఞులు నిపుణుల వ్యాసాలు మాత్రమే ప్రచురితం అవుతుంటాయి.

పరిశోధనల పరంగా దేశ విదేశాల్లో అనుసరిస్తున్న విధానాలను దేశీయ విద్యార్థులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్లాంట్ జినోమియా పేరిట అంతర్జాతీయ వేదికకు రూపకల్పన చేశాడు. దీని ద్వారా ఆధునిక వ్యవసాయ పరిశోధనలపై దేశ విదేశాల నిపుణులతో వెబినార్‌లో చర్చలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇరవైకి పైగా జాతీయ అంతర్జాతీయ వేదికల్లో అధునిక వ్యవసాయ పరిజ్ఞానం అనే అంశంపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఇందుకుగాను పదికి పైగా అవార్డులూ గెలుచుకున్నాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని