సంక్షోభంలోనూ సంక్షేమం ఆపలేదు: కేటీఆర్‌

ఏటా కోటి నాణ్యమైన చీరలు అందించడంతో పాటు నేతన్నలకు ఉపాధి కల్పించాలనే ద్విముఖ వ్యూహంతో బతుకమ్మ చీరల పంపిణీ

Updated : 29 Sep 2020 21:59 IST

బతుకమ్మ చీరల ప్రదర్శనను తిలకించిన మంత్రులు

హైదరాబాద్‌: ఏటా కోటి నాణ్యమైన చీరలు అందించడంతో పాటు నేతన్నలకు ఉపాధి కల్పించాలనే ద్విముఖ వ్యూహంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలోని హరితప్లాజాలో బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్‌తో కలిసి కేటీఆర్‌ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మహిళలకు 4 కోట్ల చీరలు పంచినట్లు చెప్పారు.

మహిళలకు నచ్చే చీర తేవడం భర్తకే కష్టమైన పని అని.. అలాంటిది ప్రభుత్వం రూపొందించిన బతుకమ్మ చీరలు వారికి నచ్చడం సంతోషమని కేటీఆర్‌ సరదాగా వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వ టెండర్‌ సైతం సిరిసిల్ల నేతన్నలకు వచ్చిందన్నారు. ప్రభుత్వం అన్ని మతాల వారికీ చీరలు అందిస్తోందని.. అక్టోబర్‌ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేపడతామని.. అవసరమైతే ఇంటింటికీ వెళ్లి అందిస్తామని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత పెట్టుకున్నాం తప్ప.. పేదల సంక్షేమంలో పెట్టలేదన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని