పీపీఈ కిట్ల పునర్వినియోగం కోసం....

కరోనా కారణంగా మాస్క్‌ లేకుండా బయట తిరగలేని పరిస్థితి. వైద్యులైతే వైరస్‌తో బాధపడుతున్న వారికి ఎనలేని సేవ చేస్తూ ముందుండి పోరాడుతున్నారు. కానీ వారు కూడా మహమ్మారి విషయంలో

Published : 31 Oct 2020 00:57 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా కారణంగా మాస్క్‌ లేకుండా బయట తిరగలేని పరిస్థితి. వైద్యులైతే వైరస్‌తో బాధపడుతున్న వారికి ఎనలేని సేవ చేస్తూ ముందుండి పోరాడుతున్నారు. కానీ వారు కూడా మహమ్మారి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వైరస్‌ సోకిన వారి వద్దకు వెళ్లాలంటే పీపీఈ కిట్లను ధరించాల్సిందే. వాస్తవానికి అవే వారికి రక్షణ కవచాలు. అయితే ప్రస్తుతం పెద్దఎత్తున పీపీఈ కిట్లను వినియోగిస్తుండటంతో..పలు సందర్భాలలో వాటి కొరత తలెత్తుతోంది. కొన్ని సార్లు డిమాండ్‌కు తగ్గట్లుగా వీటి సరఫరా ఉండటం లేదు. ఒకసారికి మించి ఉపయోగించే సౌలభ్యం లేకపోవటంతో వాటి వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దాంతో పర్యావరణ కాలుష్యం ఏర్పడటానికి, ఇతర వ్యాధులకు ఈ వ్యర్థాలు కారణం అవుతున్నాయి.ఈ సమస్యలకు పరిష్కారం చూపేలా ఓ కొత్త ఆవిష్కరణ చేసింది ఐఐటీ తిరుపతి. పీపీఈ కిట్లను, మాస్కులను పునర్వినియోగానికి వీలుగా మార్చే యంత్రాన్ని సృష్టించింది. అదే.. పోర్టబుల్‌ ఆప్టికల్‌ క్యావిటీ స్టెరిలైజేషన్‌ యూనిట్‌. 

 

ఎలా పనిచేస్తుంది?
అతినీలలోహిత కిరణాలు, కోల్డ్‌ ప్లాస్మా, హెచ్‌టూవోటూలను ఉపయోగించి వస్తువులను శుద్ధి చేసేలా ఈ పొర్టబుల్‌ ఆప్టికల్‌ క్యావిటీ స్టెరిలైజేషన్‌ యూనిట్‌ను డిజైన్‌ చేశారు. వీటిలో వస్తువులను తడి చేసి శుద్ధి చేసేలా ఒకటి, పొడిగా ఉండే పరిస్థితుల్లో శుద్ధి చేసేలా మరొకటీ రూపొందించారు. శుద్ధి చేస్తున్నప్పుడు అతినీలలోహిత కిరణాలు వస్తువులపై పడాల్సి ఉంటుంది. హెచ్‌టూవోటూను మాత్రం ఎంతసేపు? ఎన్నిసార్లు స్ర్పే చేయొచ్చన్నది వినియోగదారుడే ఎంచుకోవచ్చు. యూనిట్లో నిర్ణీత ఆప్షన్లు ఎంచుకున్న తరువాత మూడు సెకన్లలో వస్తువులను శుద్ధి చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాధారణంగా మార్కెట్లో లభించే పరికరాల్లో ఒకే దగ్గర యూవీ కిరణాలు ప్రసరితం అవుతాయి. వాటి తీవ్రతా తక్కువగా ఉంటుంది. పైగా బాహ్య ఉపరితలం మాత్రమే శుద్ధి అవుతుంది. ఈ లోపాలను అధిగమించేలా ఈ పరికరాన్ని రూపొందించారు. మొబైల్ ఫోన్లు, ఆహార పదార్థాల ప్యాకెట్లు ఇలా వేర్వేరు వస్తువులనూ ఈ పరికరం ద్వారా శుద్ధి చేసుకోవచ్చు.

 

వ్యర్థాలను తగ్గించేందుకే...

‘‘ప్రపంచ వ్యాప్తంగా నెలకు 200 బిలియన్ల పీపీఈ కిట్లను వినియోగించి వ్యర్థాలుగా విసిరేస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వినియోగించిన వాటిలో 75 శాతం మాస్క్‌లు మాత్రమే వ్యర్థ నిర్వహణ కేంద్రాలకు చేరుతున్నాయని ఐరాస చెబుతోంది. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు వీలుగా తిరుపతి ఐఐటీ తరపున ఈ పరికరానికి రూపకల్పన చేశాం. తద్వారా పీపీఈ కిట్ల పునర్వినియోగంతో పాటు.. ప్రజల ఆరోగ్యానికి చేటు చేసే వ్యర్థాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం ’’ అని ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్లు అంటున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని