భారతీయ సంగీతం ఓ అద్భుత స్వరాన్ని కోల్పోయింది..!

భారతీయ సంగీతం అత్యంత అద్భుతమైన ఓ స్వరాన్ని కోల్పోయిందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

Updated : 25 Sep 2020 16:33 IST

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

దిల్లీ: భారతీయ సంగీతం అత్యంత అద్భుతమైన ఓ స్వరాన్ని కోల్పోయిందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. యావత్‌ దేశ సంగీత ప్రియులకు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తీరనిలోటు అని రాష్ట్రపతి ట్విటర్‌లో సంతాపం వ్యక్తంచేశారు. ‘గాన చంద్రుడి’గా పిలుచుకునే బాలసుబ్రహ్మణ్యం, పద్మ భూషణ్‌తోపాటు ఎన్నో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా బాలు కుటుంబ సభ్యులకు, మిత్రులకు భారత రాష్ట్రపతి సానుభూతి తెలియజేశారు.

‘‘ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. వారు కరోనాబారిన పడి ఎంజీఎం ఆసుపత్రిలో చేరారని తెలిసినప్పటి నుంచి వైద్యులతో రోజూ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ వచ్చాను. వారి కుమారుడితో మాట్లాడి కావాల్సిన సలహాలు ఇస్తూ వైద్యులకు సూచనలు చేస్తుండేవాడిని’’

 -వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

‘‘ఎప్పీ బాలసుబ్రహ్మణ్యం హఠాన్మరణంతో మన కళా ప్రపంచం గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ప్రతి ఇంట్లో మారుమోగిన ఆయన గళం దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని అలరించింది. ఈ విచారకర సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’

- నరేంద్ర మోదీ, ప్రధాని

‘‘ప్రముఖ నేపథ్య గాయకుడు పద్మభూషణ్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యాను. ఆయన పాడిన పాటలు, సమకూర్చిన బాణీల రూపంలో మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’

- అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి

‘‘మ్యూజిక్‌ లెజెండ్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరని తెలిసి ఆవేదనకు గురయ్యాను. ఆయన అద్భుతమైన గొంతు తరాల పాటు నిలిచిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సంగీత సహచరులకు నా ప్రగాఢ సానుభూతి’’

-మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి

‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. ఆకాశవాణినే గురువుగా భావించి గొప్ప గొప్ప గాయకుల పాలు వింటూ సంగీతం నేర్చుకున్నారు. ఆయన సినీ పాటలు ఎంత ఆదరణ పొందాయో.. ఆధ్యాత్మిక గీతాలకు కూడా అంతే ప్రాచుర్యం లభించింది. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆయన ఇంటిని వేదపాఠశాలకు ఇచ్చేశారు’’

-నిర్మలా సీతారామన్‌, కేంద్ర మంత్రి 

‘‘ఐదు దశాబ్దాలకు పైగా లక్షలాది మంది హృదయాలను తన గానంతో ఆకట్టుకున్న ఎస్పీ బాలు మరణం సంగీత, సినీ పరిశ్రమకు కోలుకోలేని విపత్తు. ఆయన పరమపదించడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్న కుటుంబ సభ్యులు, అభిమానులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’’

 -పళనిస్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి

కన్నడిగులను ఎంతో అభిమానించేవారు: యడియూరప్ప

ఎస్పీ బాలు తన అద్భుతమైన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతకారులకు స్ఫూర్తిగా నిలిచారని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. కర్ణాటక ప్రజల్ని ఆయన ఎంతో అభిమానించేవారన్నారు. అంతటి నిరుపమానమైన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ధైర్యం నింపాలని దేవుణ్ని వేడుకుంటున్నానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని