కళాశాలలు అలా నడిపితే ఊరుకోం: మంత్రి సురేశ్‌

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూనే రాష్ట్రంలో పాఠశాలలను తెరుస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు.

Updated : 01 Nov 2020 13:53 IST

అమరావతి: కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూనే రాష్ట్రంలో పాఠశాలలను తెరుస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. 2020-21 విద్యా సంవత్సరాన్ని వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్‌ 2నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యా సంవత్సరం కవర్‌ చేసుకునేలా సిలబస్‌ రూపకల్పన చేసినట్లు మంత్రి వెల్లడించారు. పాఠశాలల పని దినాలు 180 రోజులు ఉంటాయని చెప్పారు. కరోనా వేళ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి సురేశ్‌ వెల్లడించారు.

ఈ నెల 2 నుంచి 9, 10 క్లాస్‌లు, ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ తరగతులు, నవంబర్‌ 16 నుంచి ఇంటర్‌ తొలిఏడాది తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. నవంబర్‌ 23 నుంచి 6,7,8 తరగతులు, డిసెంబర్‌ 14వ తేదీ నుంచి 1,2,3,4,5వ తరగతులు ప్రారంభింస్తామని వివరించారు. నవంబర్‌ 3 నుంచి రెసిడెన్షియల్‌ పాఠశాలలు, వసతి గృహాలు తెరుస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే డిగ్రీ, పీజీ తరగతుల షెడ్యూల్‌ విడుదల చేసినట్లు మంత్రి సురేశ్‌ చెప్పారు.

611 కళాశాలల అనుమతులు రద్దు..
‘‘ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేదు. ఇంటర్‌లో 5.83 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి పాసైన వారికి సమానంగా ఇంటర్‌ సీట్లు ఉన్నాయి. సీట్ల కోసం అదనంగా 153 కొత్త కళాశాలలకు అనుమతి ఇచ్చాం. రేకుల షెడ్లలో కళాశాలలు నడిపితే చూస్తూ ఊరుకునేది లేదు. అందుకోసమే కొన్ని కళాశాలల అనుమతులను పునరుద్ధరించలేదు. ఇప్పటివరకు 611 కళాశాలల అనుమతులు రద్దు చేశాం. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు పాటిస్తూనే ఇంటర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నాం. ఫీజులు 30 శాతం తగ్గించాలని విద్యాసంస్థలను ఆదేశించాం’’ అని మంత్రి వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని