ts news: ఏటేటా.. ఎగుమతుల్లో పైపైకి

తెలంగాణలో ఎగుమతుల రంగం ఏటేటా పురోగమిస్తోంది.

Published : 31 Aug 2021 15:33 IST

2020-21లో రూ.1.45 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఐటీ రంగం
ఇతర ఉత్పత్తుల్లో రూ.61,164 కోట్లతో దేశంలో రెండో స్థానం
కరోనా ప్రభావాన్ని భర్తీ చేసిన ఔషధ విభాగం

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణలో ఎగుమతుల రంగం ఏటేటా పురోగమిస్తోంది. ఐటీతోపాటు ‘ఇతర ఉత్పత్తుల’ విభాగంలోనూ గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. కరోనా సమయంలోనూ ఆ దిశగా సుస్థిరతను కొనసాగిస్తోంది. ఒక్క ఐటీ రంగంలోనే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.45 లక్షల కోట్ల ఎగుమతులు(2019-20తో పోలిస్తే 12.98 శాతం అధికం) జరిగాయి. ఇతరత్రా ఉత్పత్తుల్లో రాష్ట్రం రూ.61,164 కోట్ల ఎగుమతులను సాధించినట్లు పరిశ్రమల శాఖ తమ నివేదికలో వెల్లడించింది. 

ఐటీ.. మేటి

రాష్ట్రంలో 1,500 వరకు ఐటీ, దాని అనుబంధ సంస్థలున్నాయి. దీంతోపాటు 53 ఐటీ ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) నడుస్తున్నాయి. వీటి ద్వారా 6,28,615 మంది ఉపాధి పొందుతున్నారు. 2020 మార్చి నుంచి కరోనా ప్రభావం మొదలవగా, ఐటీ సంస్థలను మూసివేశారు. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ ప్రభావం 2020-21లో ఈ రంగంపై పడుతుందని భావించినా, దానికి భిన్నంగా అనూహ్యంగా మరింత పుంజుకుంది. రూ.1,45,522 కోట్ల ఎగుమతులను సాధించింది. 2020-21లో 46,489 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయి.

ఇతర ఉత్పత్తుల రంగాల్లో...

2020-21లో ఐటీ మినహా ఇతర రంగాలపై కరోనా ప్రభావం కొంత మేరకు కనిపించింది. పలు ఉత్పత్తుల ఎగుమతులు తగ్గినప్పటికీ ఔషధ రంగం ఆ లోటును భర్తీ చేసింది. ఔషధాలు, మందులు, టీకాల ఉత్పత్తులు పెరగడంతో మొత్తంగా ‘ఇతర ఉత్పత్తుల’ విభాగంలో ఎగుమతులు 8 శాతం పెరిగాయి. ఈ విభాగంలో జరిగిన రూ.61,164 కోట్ల ఎగుమతుల్లో ఔషధ రంగం 41 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్గానిక్‌ కెమికల్స్‌ 31 శాతం వాటా సాధించగా, ఎలక్ట్రికల్‌ యంత్రాలు, పరికరాలు 4.5%, ఉప్పు, సల్ఫర్, ప్లాస్టరింగ్‌ సామగ్రి 3%, ప్లాస్టిక్స్, ఇతర పరికరాలు 1%, కాగితం, గుజ్జు 0.7% వాటా పొందాయి. వైమానిక విడిభాగాలు, నూనెలు, పాలు, తోళ్లు, ఉక్కు, ఇనుము, ఇతర లోహాలు, జౌళి, తృణధాన్యాలు, పత్తి, రబ్బరు, వాహన విడిభాగాలు, కూరగాయలు, పండ్లు, ఇతరాలు 18% వాటా దక్కించుకున్నాయి. ఈ విభాగంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ తాజా నివేదికలో వెల్లడించింది.

ఏయే దేశాలకు...

అమెరికా, రష్యా, బ్రిటన్, బంగ్లాదేశ్, జర్మనీ తదితర దేశాలకు ఎగుమతులు సాగాయి. విమానాల రాకపోకలపై నిషేధం వల్ల కార్గో సౌకర్యాలు తగ్గడంతో గల్ఫ్‌ సహా కొన్ని దేశాలకు పూర్తిస్థాయిలో ఎగుమతులు సాగలేదు. నౌకల ద్వారా జరిగే ఎగుమతుల్లోనూ కొంత ప్రతికూలత ఏర్పడింది. 

త్వరలో ఎగుమతుల విధానం 

రాష్ట్రంలో వివిధ రంగాలకు ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం త్వరలో ఎగుమతుల కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలని భావిస్తోంది. కరోనా పరిస్థితుల ప్రభావం తగ్గిన తర్వాత దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుందని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని