Kanipakam Temple: కాణిపాకం వినాయకుడి అభిషేకానికి రూ.5వేలా?

చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టికెట్ ధర పెంపు అంశం వివాదాస్పదంగా మారింది. టికెట్‌ ధర ఒకే సారి రూ.700  నుంచి రూ.5వేలకు పెంచడంతో భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

Published : 07 Oct 2022 01:32 IST

కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి పంచామృత అభిషేకం టికెట్ ధర పెంపు అంశం వివాదాస్పదంగా మారింది. టికెట్‌ ధర ఒకే సారి రూ.700  నుంచి రూ.5వేలకు పెంచడంతో భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో దేవాదాయశాఖ స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్వామివారి అభిషేకం టికెట్‌ ధర పెంచడాన్ని ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్‌ ధరలు భక్తులు అందరికీ అందుబాటులో ఉండాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అభిషేకం టికెట్ ధర రూ.700 నుంచి రూ.5,000కు పెంచడానికి ఆలయ అధికారులు విడుదల చేసిన అభిప్రాయ సేకరణ పత్రం వారి అవగాహనా రాహిత్యంగా పరిగణిస్తున్నామని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ అభిప్రాయ సేకరణ పత్రంపై పూర్తి స్థాయిలో చర్చ జరిపి ఉపసంహరించుకునేలా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానమే యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

ఏకపక్ష నిర్ణయం తీసుకున్న వారిపై చర్యలు: దేవాదాయశాఖ మంత్రి 

కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అభిషేకం టికెట్‌ ధర పెంచలేదని, ఇప్పటి వరకు ఉన్న రూ.700ల టికెట్‌ ధర యథావిధిగా కొనసాగిస్తామని దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దాతల సహకారంతో అత్యంత సుందరంగా పునఃనిర్మించిన ఆలయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి అభిషేకం భక్తులకు అందుబాటులో ఉండాలని దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, సభ్యులు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. స్వామివారి అభిషేకం టికెట్‌ ధర రూ.700 నుంచి రూ.5వేలకు పెంచడానికి ఆలయ అధికారులు విడుదల చేసిన ప్రజాభిప్రాయ సేకరణ పత్రం (RC.No.G1/2380/2011, Date:27/09/2022) అవగాహనా రాహిత్యంగా పరిగణిస్తున్నట్టు దేవాదాయశాఖ తెలిపింది. ఈ అభిప్రాయ సేకరణ పత్రంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, టికెట్‌ దర పెంపుపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని