Health: తల్లి కడుపుకు కోతలెందుకు..!

మంచిరోజు, మంచి ముహూర్తం అంటూ తల్లి కడుపు కోయిస్తున్నారు. వైద్యుల ప్రమేయం లేకుండా తల్లిదండ్రులు, అత్తామామలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు

Published : 21 Apr 2022 01:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు సిజేరియన్‌ అంటే వింతగా చెప్పుకునేవారు. ఇపుడు సహజకాన్పు జరిగిందంటే ఆశ్చర్య పోతున్నారు. మంచిరోజు, మంచి ముహూర్తం అంటూ తల్లి కడుపు కోయిస్తున్నారు. వైద్యుల ప్రమేయం లేకుండా తల్లిదండ్రులు, అత్తామామలు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు కొన్ని చోట్ల అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులతో ఏర్పడే ఇబ్బందులు, కష్టనష్టాలు ఎన్నో ఉన్నాయి. భూమి మీద ఉన్న ఏ జీవికి లేని విచిత్ర పరిస్థితి మనిషికి మాత్రమే ఉంది. వైద్య, వైజ్ఞానిక పరంగా ఎంత పురోగమించినా వింత నమ్మకాలతో అమ్మ కడుపునకు కోత పెడుతున్నారు. రోజురోజుకూ సహజ కాన్పులు తగ్గిపోతున్నాయి. ఈ పరిణామాల తీరుతెన్నులపై గైనకాలజిస్టు లక్ష్మీరత్న పలు విషయాలు చెప్పారు.

ఎందుకు చేయాల్సి వస్తుంది: ఇటీవల సిజేరియన్లు ఎక్కువగానే జరుగుతున్నాయి. గతంలో కంటే అధికంగా ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రసూతి మరణాలు కూడా తగ్గాయి. కొన్నిసార్లు తల్లులు, వైద్యులు సిజేరియన్‌కు వెళ్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు 15శాతం సిజేరియన్లు అవసరం అవుతాయి కానీ అంతకు మించి కొన్ని ఆసుపత్రుల్లో 50-70 శాతం ఆపరేషన్లు చేస్తున్నారు. చాలా మంది మంచి ముహూర్తాలకు పిల్లలను కనడం అధికమయ్యింది. చాలా మంది తల్లులు నొప్పి భరించక ఆపరేషన్‌ చేయాలని చెబుతున్నారు. మొదటి కాన్పుకు ఆపరేషన్‌ చేస్తే రెండో కాన్పుకు కూడా ఆపరేషన్‌ చేయాల్సి వస్తోంది. 

* బిడ్డ తల, శరీరం పెద్దగా ఉన్నపుడు, తల్లి కటిభాగం నుంచి సురక్షితంగా వెళ్లలేనప్పుడు..

* బిడ్డకంటే తల్లి కటిభాగం చిన్నగా ఉన్నపుడు..

* సహజకాన్పుతో గర్భాశయం చిట్లే ముప్పు ఉంటుందని భావించినపుడు..

* ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని తేలినపుడు..

* మాయపొర గర్భాశయ గోడకు చాలా కిందికి అంటుకొని ఉండి.. గర్భాశయ ముఖద్వారం గుండా బిడ్డ బయటకు రాకుండా అడ్డు పడుతున్నపుడు..

* బిడ్డ అడ్డం తిరిగినపుడు..

* బిడ్డ తలకు బదులు కాళ్లు ముందుకు ఉన్న సమయంలో తప్పనిసరిగా శస్త్ర చికిత్స చేయాల్సిందే.

* అధిక రక్తపోటు ఉన్నపుడు ఆపరేషన్‌ చేయాలి. మధుమేహం ఎక్కువగా ఉన్నపుడు బిడ్డ బాగా పెరిగిపోతుంది. అది మంచిది కాదు. 

* ఉమ్మనీరు తక్కువగా ఉన్నపుడు తల్లీబిడ్డలను రక్షించడానికి సిజరేయన్‌కు వెళ్లాలి.

ఇబ్బందులెన్నో

* ఆపరేషన్‌ చేసే సమయంలో జనరల్‌ అనస్థీషియా ఇవ్వొచ్చు. కొన్నిసార్లు వెన్నెముకకు మత్తుమందు ఇవ్వక తప్పదు. వీటితో సమస్యలు వస్తాయి.

సహజ ప్రసవంతో యోజనాలెన్నో..

* ఆపరేషన్‌ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా సమస్యలు రావొచ్చు. కనీసం 30-40 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. అదే సాధారణ ప్రసవంతో తెల్లారే పనులు చేసుకోవడానికి ఇబ్బందులుండవు.

* సాధారణ ప్రసవం అయిన వారికి మానసికంగా బిడ్డను కన్నామనే సంతృప్తి అధికంగా ఉంటుంది. 

* ఆపరేషన్‌ తర్వాత ఐసీయూలో పెట్టడం, కుట్లు మానేదాకా ఆసుపత్రిలో ఉండటం ఇబ్బందికరమే. 

* ఆదరాబాదరా ఆపరేషన్లతో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్లు వస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

* సాధారణంగా పుట్టిన వారికంటే ఆపరేషన్‌లో పుట్టిన బిడ్డకు అలెర్జీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

* సహజ ప్రసవంలో బిడ్డ కడుపులో ఏదైనా ద్రవం మింగినా బయటకు వచ్చేస్తుంది. ఇది చాలా మంచి పరిణామం. 

* గర్భిణులకు అవగాహన కల్పించడంతో సహజ ప్రసవం చేయడానికి ఉన్న అవకాశాలను తెలియజేయాలి.

* భార్యభర్తలకు అవగాహన కల్పించడంతో కూడా సహజ ప్రసవాలను చేయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని