నూతన వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం ఒప్పందం

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నూతన వ్యాక్సిన్‌ల అభివృద్ధి కోసం ప్రభుత్వం దృష్టి సారించింది. ఫ్యూచర్ బయోథెరపెటిక్స్, బయోటెక్ కంపెనీలతో సీఎస్ఐఆర్- ఐఐసిటీ ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 30 Mar 2021 01:04 IST

మూడు సంస్థలతో కుదిరిన ఎంవోయూ


హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నూతన వ్యాక్సిన్‌ల అభివృద్ధి కోసం ప్రభుత్వం దృష్టి సారించింది. ఫ్యూచర్ బయోథెరపెటిక్స్, బయోటెక్ కంపెనీలతో సీఎస్ఐఆర్- ఐఐసిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా  హైదరాబాద్ లోని ఐఐసీటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎస్‌ఐఆర్‌ డీజీ డాక్టర్‌ శేఖర్‌ మాండే మాట్లాడారు. భారత్ బయోటెక్, బయోవెట్, సాపిజెన్ బయాలాజిక్స్ కంపెనీలతో కుదిరిన ఈ మాస్టర్ కొలాబరేటివ్ అగ్రిమెంట్ ఎంతో కీలకమైందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో జరిగిన ఈ ఎంవోయూ వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు అవసరమైన అడ్జువెంట్స్, రసాయన కారకాల వేగవంత పంపిణీకి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్ తయారీని ప్రస్తావిస్తూ.. దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధిలో భారత్ బయోటెక్ సామర్థ్యం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందని డీజీ కొనియాడారు.

భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. సీఎస్ఐఆర్ ఐఐసీటీతో చేసుకున్న ఈ ఒప్పందం.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అనేక వ్యాధులను నయం చేసేందుకు, భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కొనేందుకు దోహదపడుతుందని అన్నారు. కొవాగ్జిన్ తయారీలో ఐఐసీటీ సహకారం ఎనలేనిదని.. వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు అవసరమైన రసాయన కారకాలు, ముడి పదార్థాల కొరత వేధిస్తోందని కృష్ణ ఎల్లా తెలిపారు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థల మధ్య ఇలాంటి భాగస్వామ్య ఒప్పందాలు ఈ సమస్యను అధిగమించేందుకు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. థైమస్, బీటా మాలిక్యూల్ లాంటి ముడి పదార్థాల కోసం జర్మనీ, చైనా లాంటి దేశాలపై ఆధారపడుతున్నామని.. ఆత్మనిర్భర భారత్ అభియాన్ ద్వారా ఇలాంటి రసాయన పదార్థాలను దేశీయంగా అభివృద్ధి చేస్తూనే.. గ్లోబల్ కంపెనీలతో ఇంటిగ్రేట్ అవుతున్నామని సీఎస్ఐఆర్ డీజీ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని